ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్నందున ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వరద నష్టాలను చూసేందుకు బయలుదేరి వెళ్లే ముందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో పరిస్థితిని అంచనా వేశారు. ముందుగానే అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


Also Read : వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం


తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాన్‌ సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు చూస్తారు. 


Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !
 
దక్షిణ థాయ్‌లాండ్‌ పరిసరాల్లో అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం తుఫాన్‌గా మారి శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉంది. మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు జావద్ అని పేరు పెట్టారు. 


Also Read: నెల్లూరు పర్యటనకు సీఎం జగన్.. స్థానిక నాయకుల్లో టెన్షన్ టెన్షన్..


ఉత్తరాంధ్రను గతంలో పలు తుపాన్లు వణికించాయి. మూడేళ్ల క్రితం వచ్చిన తీత్లీ కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో తుపాను ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు వీలైనంత తక్కువగా ఉండేలా చూసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  


Also Read: "సంపూర్ణ గృహహక్కు" తో పేద ప్రజలకు లక్షల ఆస్తి .. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమే ! ఓటీఎస్‌ పథకంపై పూర్తి డీటైల్స్ ఇవిగో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి