ఇటీవల భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం జగన్ కు తమ బాధలు వివరించారు. వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వరద బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండండని జగన్ హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.90వేల సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ ను బాధితులు కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత అన్ని విధాలుగా ఆదుకుంటానని సీఎం జగన్ చెప్పారు. గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సీఎం పరిశీలించారు.
Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !
బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం : సీఎం
వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్.. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని బాధితులకు హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పారు. వరదలతో చాలా నష్టం జరిగిందన్న సీఎం... వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు బాగా పనిచేశారని సీఎం జగన్ అన్నారు. రాజంపేట మండలంలోని మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు.
Also Read: నెల్లూరు పర్యటనకు సీఎం జగన్.. స్థానిక నాయకుల్లో టెన్షన్ టెన్షన్..
ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం
వరద నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని సీఎం జగన్ అన్నారు. వరద ప్రాంతాల్లో అధికారులు పని తీరు భేషుగ్గా ఉందన్నారు. 'సహాయం అందని వారు గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయండి. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేస్తాం. డ్యామ్ లు రెండు కొట్టుకుపోయిన పరిస్థితి. పొలాల్లో ఇసుక మేటలు వచ్చాయి. ఇసుక మేటలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి హెక్టార్ కు రూ.12 వేలు ఇచ్చేట్లు చర్యలు తీసుకుంటాం. ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి కూడా పరిహారం అందిస్తాం. పొదుపు సంఘాల వారికి కూడా అండగా ఉంటాం. చదువుకున్న పిల్లలకు, వాహనాలు కోల్పోయిన వారిని కూడా ఆదుకుంటాం. వరద గ్రామాల్లో జాబ్ మేళా పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. అధికారాలు ఇక్కడే ఉంటారు. 6 గ్రామాలకు ఒక సబ్ కలెక్టర్ ఇంచార్జ్ గా ఇక్కడే ఉంటారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు డిప్యూటీ కలెక్టర్ లు ఇక్కడే ఉంటారు. ఎప్పుడూ ఊహించని విధంగా 3 లక్షల క్యూసెక్కుల నీరు డ్యామ్ లకు వచ్చింది. కలెక్టర్ చాలా బాగా పనిచేశారు. లేకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగేది. డ్యామ్ లు డిజైన్ లు మార్చి కట్టేలా చర్యలు తీసుకుంటాం. నీళ్లు గ్రామాలలోకి రాకుండా రక్షణ గోడలు నిర్మిస్తాం. అన్ని రకాల ఎమ్మెల్యే మేడా, జడ్పీ ఛైర్మన్ ఆకెపాటి, వైసీపీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు.' అని సీఎం జగన్ అన్నారు.
చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన
చిత్తూరు జిల్లాకు వరదల వల్ల ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పాపా నాయుడుపేట నుంచి గుడిమల్లం మీదుగా వెళ్లే స్వర్ణముఖి నది మీద నిర్మించిన బ్రిడ్జి ఇటీవల వరదలకు కొట్టుకుపోగా ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ, ఏపీ ట్రాన్స్కో, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాలకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ సీఎంకు వివరించారు. అనంతరం గుడిమల్లం గ్రామానికి వెళ్లే బ్రిడ్జి స్వర్ణముఖి నది దాటికి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా నదీ ప్రవాహం వల్ల 15 గ్రామాలకు రాకపోకలు లేవని అదే విధంగా పలు భూములు కూడా ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయని ముఖ్యమంత్రికి చూపించారు. మొత్తం 195 మీటర్లు గల బ్రిడ్జి కొట్టుకు పోయిందని, తాత్కాలిక మరమ్మతులకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని, శాశ్వతంగా నిర్మించేందుకు రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
సమీక్ష రద్దు
తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం రద్దైంది. రేపు ఉదయం సమీక్షా సమావేశం ఉండే అవకాశం ఉంది. సమీక్షా సమావేశం అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలు పాడిపేట, ఆటోనగర్, శ్రీకృష్ణ నగర్ లో సీఎం జగన్ పర్యటించనున్నారు.
Also Read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి