Food Poision In Nuzivedu Triple IT | ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు 800 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే దాదాపు 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గ‌డిచిన మూడు రోజులుగా తీవ్ర‌మైన జ్వ‌రం, క‌డుపు నొప్పి, వాంతులు, విరేచ‌నాల‌తో విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితిపై అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అంశంపై క‌మిటీ వేశామ‌ని ట్రిపుల్ ఐటీ ప‌రిపాల‌నాధికారి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితిపై అశ్ర‌ద్ధ త‌గ‌ద‌ని నిన్న‌నే అధికారుల‌ను హెచ్చ‌రిస్తూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అయినా అధికారుల్లో మాత్రం మార్పు రావ‌డం లేదు. 


గత వారం మెడిక‌ల్ యూనివ‌ర్సిటీలో విద్యార్థులకు అస్వస్థత


వారం క్రిత‌మే అపోలో మెడిక‌ల్ యూనివ‌ర్సిటీలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఇదే విధంగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా క‌డుపు నొప్పి, వాంతులు, విరేచ‌నాల‌తో ఆస్ప‌త్రిలో చేరారు. జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరిన వారికి చికిత్స అందించి ఇంటికి పంపారు. ఇప్ప‌టికీ కొంత మందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌నలు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం విద్యార్థుల‌కు మాటిస్తూ ఆస్స‌త్రి డీన్ పేరుతో లేఖ‌ను విడుద‌ల చేసింది. 


మొన్న‌నే కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గుర‌య్యారు. దీనిపై వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్య, వైద్య శాఖల అధికారులకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 


వర్షాకాలం కావడంతో అనారోగ్య సమస్యలు
వాతావ‌ర‌ణం మార‌డంతోపాటు వ‌ర్షాకాలం కావ‌డంతో రాష్ట్రంలో డ‌యేరియా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా హాస్ట‌ళ్ల‌లో ఉంటున్న విద్యార్థులు ఎక్కువ‌గా అనారోగ్యం బారిన‌ప‌డుతున్నారు. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం, కలుషిత‌మైన ఆహారం తిన‌డం, నీటి విష‌యంలో అజాగ్ర‌త్త‌గా ఉండ‌టం ఈ అనారోగ్యాల‌కు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న స్కూల్‌, కాలేజీ హాస్ట‌ళ్ల‌లోనే ఎక్కువ‌గా ఇలాంటి కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. వర్షాకాలం నేప‌థ్యంలో తాగేనీరు, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.