Kurma Avatar Kurma Jayanti Date 

మంధనాచల ధారణ హేతోదేవాసుర పరిపాలవిభో కూర్మాకార శరీర నమోభక్తం తే పరిపాలయమామ్

కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం మధించడం ప్రారంభించారు. మందరగిరిని కవ్వంగా , వాసుకిని తాడుగా చేసుకుని చిలికారు.  ఆ సమయంలో మందరపర్వతం కిందకుజారిపోతూ సాగర మధనానికి ఆటంకం కలిగించింది. దాన్నుంచి బయటపడేలా దీవించమని దేవతలంతా శ్రీ మహావిష్ణువుని పూజించారు. అప్పుడు నారాయణుడు కూర్మరూపంలో మందరగిరి కిందకు చేరి తన వీపుపై మోసాడు. ఇలా ఉద్భవించిందే కూర్మావతారం.   

2025 లో కూర్మజయంతిని మే 12 సోమవారం జరుపుకుంటారు ఏటా వైశాఖ పూర్ణిమ రోజు కూర్మజయంతి జరుపుకుంటారు. ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకూర్మంలో వైశాఖ పూర్ణిమరోజు కూర్మజయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.  ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయం ఇది. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకాకుళం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున కొలువయ్యాడు కూర్మనాథుడు. కృతయుగంలో శ్వేతరాజు ఆయన భార్య    వంశధారల తపస్సుకు మెచ్చిన కూర్మనాథుడు ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా వెలిశాడు. ఈ క్షేత్రం గురించి కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాల్లో ఉంది. ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలుంటాయి. ఈ రెండు ధ్వజస్తంభాలు శివకేశవులకు ప్రతీకలుగా చెబుతారు. 

శ్రీకూర్మం దేవాలయంలో మూలవిరాట్టు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రతిష్టించాడట.ఇక్కడున్న పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. స్వామివారి చేతిలో ఉన్న సుదర్శనచక్రంతో పుష్కరిణి వచ్చిందట. అందుకే ఈ గుండంలో స్నానం ఆచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వసిస్తారు. ఏటా వైశాఖ పౌర్ణమ రోజు, హోలీ పౌర్ణమి రోజు ఆలయంలో భాీగా ఉత్సవాలు జరుగుతాయి.  

శ్రీకూర్మం ఆలయం ఎవరు నిర్మించారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు కానీ ఏడో శతాబ్ధంలో వెలుగులోకి వచ్చింది..అప్పటి నుంచి  తరతరాలుగా రాజవంశాలు అభివృద్ధి చేస్తూ వచ్చాయి.  కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో శ్రీ కూర్మం అభివృద్ధి చెందింది. ఆదిశంకరాచార్యులు,  రామానుజాచార్యులు, మధ్వాచార్యుల శిష్యులు వీరంతా శ్రీ కూర్మాన్ని సందర్శించారు.ఆలయం పైభాగం అష్టదళ పద్మాకారంలో ఆకట్టుకునేలా ఉంటుంది.  శిల్పకళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే..రాతి స్తంభాలు ఏవీ కూడా ఒకదానితో మరొకటి పోలి ఉండదు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేవారంతా అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్లొస్తారు. శ్రీకాకుళం చేరుకుంటే అక్కడి నుంచి బస్సు, కారు సౌకర్యాలున్నాయి.

ప్రతి పౌర్ణమికి సముద్రస్నానం ఆచరిస్తారు హిందువులు.  పౌర్ణమి రోజు సముద్రస్నానం ఆచరిస్తే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు.పౌర్ణమి రోజు ఉండే నక్షత్రం ఆధారంగా నెలల పేర్లు ఏర్పరుచుకున్నాం...వాటి అనుగుణంగానే వ్యవసాయ పనులు కొనసాగిస్తారు. పౌర్ణమి రోజు చంద్రుడి ప్రభావం మనసుపై ఉంటుంది..అందుకే ఆ మనసుని స్థిరంగా ఉంచేందుకే ప్రత్యేక పూజలు, జపాలు చేస్తారు

వైశాఖపూర్ణిమను మహావైశాఖిగా పిలుస్తారు. ఈ రోజు సముద్రస్నానం ఆచరిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. వైశాక పౌర్ణమి రోజు మహావిష్ణుని ఆరాధిస్తారు, ఈ రోజు కొందరు  సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. వేసవికాలం కాబట్టి  ఆహారం, నీటి కుండ, గొడుగు, చెప్పులు దానం చేస్తే అత్యంత పుణ్యఫలం.