వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన పోస్ట్ చేశారు. మరో 1000 ఏళ్లు అయినా భారత్, పాక్ మధ్య కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదని సెటైర్ వేశారు. తన సాయం కోరితే, తన మధ్యవర్తిత్వం ఆశిస్తే కనుక వెయ్యేళ్ల తరువాత అయినా కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాను అనేలా ట్రంప్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

"ఎంతో మంది చావు, వినాశనానికి దారితీసే ప్రస్తుత ఉద్రిక్తత, దాడులను ఆపాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని కలిగి ఉన్నందుకు భారతదేశం, పాకిస్తాన్‌ల శక్తివంతమైన నాయకత్వం పట్ల గర్వంగా ఉంది.  లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం మెరుగ్గా ఉంటుంది. భారత్, పాక్ ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా వారికి సహాయం చేయగలిగినందుకు గర్విస్తున్నాను. 

 

ఈ రెండు గొప్ప దేశాలతో చర్చించకపోయినా వర్తకం, వాణిజ్యాన్ని భారీగా పెంచబోతున్నాను. దాంతోపాటు "1000 సంవత్సరాల" తర్వాత సైతం పరిష్కారం అవకపోతే కాశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం వెతికేందుకు మీ ఇద్దరితో కలిసి పని చేస్తాను. ప్రస్తుతానికి కాల్పుల విరమణ, దాడుల విషయంలో వెనక్కి తగ్గిన భారత్, పాకిస్తాన్ దేశాల నాయకులను దేవుడు దీవించాలి!" అని ట్రూత్ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోస్ట్ చేశారు.