గోరంట్ల : సరిహద్దులో పాక్ సైన్యంతో పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన జవాను మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అమరుడైన జవాను మురళీ నాయక్ కుటుంబానికి ఐదెకరాలు భూమి ఇస్తామని ప్రకటించారు. 300 గజాల ఇంటి స్థలంతో పాటు మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కష్టకాలంలో మురళీనాయక్ కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. మురళీనాయక్ స్వగ్రామం వెళ్లిన పవన్ కళ్యాణ్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. మురళీనాయక్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ఏ సాయం కావాలన్నా చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.
పాకిస్తాన్ ప్రేరేపేత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎందరో అమాయకులు బలయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. పాక్ దొంగదెబ్బ తీస్తూ, కుయుక్తులు ప్రదర్శిస్తూ సరిహద్దులో కాల్పులకు తెగబడుతోంది. దేశ భద్రత కోసం సరిహద్దులో పోరాడుతూ కొందరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన జవాన్లలో ఏపీకి చెందిన వీర జవాను మురళీ నాయక్ ఉన్నారు. యువకుడైన మురళీ నాయక్ దేశం కోసం పోరాడుతూ తన ప్రాణత్యాగం చేశారు.
గ్రామానికి మురళీనాయక్ పేరు..ఏపీ ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని సీఎం చంద్రబాబు నిర్నయం తీసుకున్నారు. ఐదెకరాల వ్యవసాయ భూమి, 300 గజాల స్థలాంలో అర్బన్ ఏరియాలో ఇల్లు కట్టించి ఇస్తాం, కుటుంబసభ్యులకు ఓ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి గౌరవించుకుంటామన్నారు. జవాను స్థానికులకే కాదు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం. గ్రామానికి మురళీ నాయక్ పేరు పెడతామన్నారు.
వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలకు పలువురు ఏపీ మంత్రులు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సవిత, అనగాని సత్యప్రసాద్, పలువురు నేతలు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు వచ్చారు. ఆదివారం ఉదయం ఒక్కొక్కరుగా కల్లితండాకు చేరుకున్న మంత్రులు మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. దేశం కోసం బిడ్డను పంపిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ కష్టకాలంలో అంతా వారికి మద్దతుగా ఉంటామని, ఏ సాయం కావాలన్నా ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం మురళీనాయక్ అంతిమయాత్ర ప్రారంభమైంది.