అమెజాన్ లో హెర్బల్ ఉత్పత్తుల పేరుతో గంజాయి విక్రయించిన కేసులో ఏడుగురు అరెస్టు అయ్యారు. విశాఖలో ఐదుగురు, మధ్యప్రదేశ్లో ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 600 కేజీల దాకా గంజాయి రవాణా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే కేసులో ఇద్దరు అమెజాన్ డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు.
నిందితులు చిలకపాటి శ్రీనివాసరావు, జీరు కృష్ణమూర్తి, బిజ్జం కృష్ణంరాజు, చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి మోహన్ రాజును అరెస్ట్ చేసినట్టు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. వారి దగ్గర 48 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, గంజాయి ప్యాకింగ్ మెటీరియల్, అమెజాన్ టేపులు, బ్యాగులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో సూరజ్, ముకుల్ జైస్వాల్‌ను అరెస్టు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా పోలీసులు సూరజ్ అలియాస్ కల్లూ పావవియా, పింటూ అలియాస్ బిజేంద్ర సింగ్ తోమర్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారించారు. నాలుగు నెలలుగా అమెజాన్ లో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు రూ.1.10 కోట్ల విలువైన గంజాయిని తరలించినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరైన సూరజ్ హెర్బల్ ప్రోడక్ట్స్, కరివేపాకు విక్రేతగా అమెజాన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఇక తన పని మెుదలు పెట్టాడు. గంజాయిని తరలిస్తూ.. మధ్యప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, రాజస్థాన్ కూడా తరలిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
అయితే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అమెజాన్ కు మధ్యప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. మరో విషయం ఏంటంటే.. ఇంత జరుగుతున్నా.. అమెజాన్ ఈ విషయాన్ని గుర్తించలేదని తేలింది. ఈ వ్యవహారంలో లాజిస్టిక్ సదుపాయంతో పాటు డెలివరీ సదుపాయం సైతం అమెజాన్ ఇచ్చిందని.. కానీ ఎక్కడా దీన్ని కంపెనీ గుర్తించలేకపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా స్పందించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పింది.
Also Read: Vishaka: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా
Also Read:Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...