ఆంధ్రప్రదేశ్ నుంచి 2020-21లో 42 వేల 935 మెట్రిక్ టన్నుల అరటి పళ్ళు ఎగుమతి అయినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్ సభలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే గ్రాండ్-9 అరటిపళ్ళకు విదేశాలలో మంచి డిమాండ్ ఉన్న విషయం వాస్తవమేనా అని రాజ్యసభలో శుక్రవారం వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. అరటి వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు.
అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ. అరటి ఎగుమతులను ప్రోత్సహించడానికి అపెడా పలు చర్యలు చేపడుతూ ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాను ఎగుమతులకు అనువైన అరటి సాగుకు సానుకూలమైన ప్రాంతాలను అపెడా గుర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి అరటి ఎగుమతుల కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. జాతీయ పరిశోధనా సంస్థలు, ఉద్యానవన విశ్వవిద్యాలయాల సహకారంతో అరటి సాగును ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఎగుమతులు చేయగల సామర్థ్యం కలిగిన వారిని సంప్రదిస్తోందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్‌కు అవసరమైన సాగు విధానాలను అమలుచేస్తోందన్నారు. అలాగే క్రయ-విక్రయదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపిక చేసిన అరటి సాగు క్లస్టర్లలో 100 శాతం టిస్యూ కల్చర్ అరటిని సాగు చేసేందుకు ప్రోత్సహిస్తోందని మంత్రి లోక్ సభ తెలిపారు. అరటి ఎగుమతుల రవాణాకు వీలుగా ముంబైలోని పోర్టుకు నేరుగా ప్రత్యేక రైలును ప్రవేశపెట్టినట్లు మంత్రి వివరించారు.
లక్షా 57 వేల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్
భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద దేశంలో లక్షా 57 వేల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పించినట్లు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేష్వర్ పాటిల్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. 2023 ఆగస్టు నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే విధంగా భారత్‌నెట్ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జులై 9 నాటికి దేశంలో లక్షా 57 వేల 919 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. భారత్‌నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద కేవలం అండర్ గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు కల్పించే పనులు చేపట్టడంతో కొన్ని సమస్యలు తలెత్తినట్లు మంత్రి చెప్పారు. భారత్‌నెట్ ఫేజ్ 2 కింద ఆంధ్రప్రదేశ్‌తో సహా 8 రాష్ట్రాలలో 65 వేల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో అమలు జరుగుతోందన్నారు. అయితే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు జరగనందున ప్రాజెక్ట్ గడువుపై ప్రభావం పడుతోందని జవాబిచ్చారు.