Warangal Scientists: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు మరో వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. బయోటెక్నాలజీ విధానంలో ఈ కొత్త రకం వరి వంగడానికి ప్రాణం పోశారు. వరంగల్ -1487 గా పిలిచే ఈ సన్న గింజ వంగడం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా వరి రకాలను మర పట్టిస్తే క్వింటాలుకు కేవలం 57 నుంచి 62 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయి. ఇందులో కూడా వివిధ రకాల వరి వంగడాలను బట్టి దిగుబడి వస్తోంది. యాసంగిలో విపరీతమైన ఎండలతో బియ్యం మరింత ఉత్పత్తి తగ్గిపోతోంది. సన్న గింజలో నూక శాతం పెరుగుతోంది. అయితే తాజాగా అభివృద్ధి చేసిన వరి వంగడాన్ని మర పట్టిస్తే క్వింటాకు 70 కిలోల బియ్యం వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకం వరిలో నూక శాతం కూడా తక్కువగా ఉంటుందని వరంగల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
120 రోజుల కంటే తక్కువ సమయంలో పండే వరి రకాల సాగు
సీజన్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ వర్షాకాలంలో 120 రోజుల కంటే తక్కువ సమయంలో పండే స్వల్ప కాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ మేరకే కూనారం సన్నాలు, కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ఎస్ఆర్ 21278, ఆర్ఎస్ఆర్ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా, ఎంటీయూ 1010, జగిత్యాల 24423, ఐఆర్ 64, హెచ్ఎంటీ సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలనే అధిక శాతం రైతులు నారు పోశారు. మరోవైపు పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, విత్తనాలు నాే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
వానా కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని కళ్లల్లో వత్తులేసుకొని చూసిన అన్నదాతలకు.. కాస్త ఆలస్యమైనా వరుణ దేవుడు కరుణించాడు. ఎట్టకేలకు వర్షాలు పడుతుండడంతో నారు మడులు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. సాధారణంగా మే మూడో వారంలోనే నారు పోయడం, తర్వాత నెల రోజులకు నాట్లు వేయడం అందరూ చేసే పనే. కానీ ఈసారి నైరుతి రుతు పవనాల రాక కాస్త ఆలస్యం అవడంతో.. జూన్ నాలుగో వారంలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నార్లు పోశారు.