పెరుగుతున్న వాహనాల సంఖ్య, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో ఇప్పటికే మానవాళి భయంకరమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. గ్లోబల్ వార్మింగ్ అంటూ పర్యావరణ నిపుణులు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఎంత గట్టిగా చెబుతున్నా ఆ దిశగా ప్రపంచ దేశాలు చేపడుతున్న చర్యలు సరిపోవడం లేదు. అనూహ్యంగా వరదలు రావడం, లేదంటే అనావృష్టితో వాతావరణంలో వస్తున్న మార్పులు మనిషి మనుగడపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంపై ఏర్పడిన ఎల్‌నినో మానవాళికి పెను సవాలు విసురుతోంది.
పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో అనూహ్య వాతావరణ మార్పులు ఏర్పడనున్నాయి. భూ వాతావరణం వేడెక్కడం, రుతుపవనాల గమనం దెబ్బతింటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకూడదన్న పారిస్ ఒప్పందానికి విఘాతం కలగనుందని, 2024లోనే సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటనుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది రెండు డిగ్రీల సెల్సియస్‌ను చేరుకుంటే భూ వాతావరణం మరింత వేడెక్కుతుందని అంచనా వేస్తున్నారు.
అనూహ్య వాతావరణ మార్పులు
ఎల్‌నినో కారణంగా అనూహ్య వాతావరణ మార్పులు ఏర్పడనున్నాయి. ఎల్ నినో కారణంగా రుతు పవనాల గమనం దెబ్బతింటుందని, కరవు కాటకాలు, కుండపోత వర్షాలు వంటివి సంభివించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. అడవుల్లో కార్చిచ్చు వంటివి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ఎల్‌నినో ప్రభావం చూపిస్తుందని, ఆహార పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
యూరప్ వాసులూ జర జాగ్రత్త!
ఎల్‌నినో ప్రభావం యూరప్ ఉత్తర ప్రాంతంపైనా ఉండనుంది. ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది తీవ్రమైన చలి, పొడి వాతావరణాన్నిప్రజలు అనుభవించనున్నారు. యూరప్ వాసులు ఇందుకు తగ్గట్లు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇక్కడ జెట్ స్పీడ్‌తో వీచే రాస్‌బై వేవ్స్ అల్లకల్లోలం సృష్టిస్తూ, హిందూ మహాసముద్రంపైకి విస్తరిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
మనపై ప్రభావమెంత?
భారతదేశానికి సంబంధించి చివరి వందేళ్లలో 18 కరవు సంవత్సరాలు ఉండగా, అందులో పదమూడింటిపై ఎల్ నినో ప్రభావం ఉంది. 1900 నుంచి 1950 వరకు ఏడు ఎల్‌నినో సంవత్సరాలు ఉండగా, 1951 నుంచి 2021 వరకు 15 ఎల్ నినో సంవత్సరాలు ఉన్నాయి. వీటిల్లో తొమ్మిదేళ్లు యావరేజ్ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది.
ఏమిటీ ఎల్‌నినో?
సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్‌నినో వర్షాభావ పరిస్థితిని, దాని వ్యతిరేక పదం లానినో విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితిని వివరిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్ నినో, లా నినోలకు కారణం అవుతున్నాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ (ఈఎన్‌ఎస్‌వో) వలయాలు అంటారు. ఈఎన్‌ఎస్‌వో ఉష్ణదశను ఎల్‌నినో అని, చలి దశను లా నినో అని పేర్కొంటారు. ఎల్‌నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతున్నది. ఈ పెరుగుదల ఒక్కోసారి 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉండవచ్చు. దీనివల్ల సముద్రం, దానిపైన ఆవరించిన వాతావరణం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుంది.