చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడం అంత తేలిక కాదు! విచ్చలవిడిగా పురుగు మందులు వాడాలి! ఆ క్రమంలో భూసారం తగ్గిపోతుంది! పంట విషతుల్యంగా మారుతుంది. అంతకుమించి పెట్టుబడి పెరిగిపోతుంది. రైతులకు ఇదొక నిత్య సమస్య. ఏం చేసినా పెస్టిసైడ్స్ వాడకం తప్పదు. కానీ ఈ రైతు వినూత్నమైన ఐడియాతో పురుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నాడు.
పై ఫోటోలోని రైతుపేరు రామకృష్ణారెడ్డి. సొంతూరు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామం. తనకున్నభూమిలో కూరగాయల పంటలను సాగు చేస్తుంటాడు. ప్రతిసారి చీడపురుగుల సమస్య వెంటాడేది. మందులెన్ని వాడినా పరిష్కారం దొరకలేదు. ఏమైనా ఐడియా ఇస్తాడేమో అని, ఇజ్రాయిల్ దేశంలో ఉంటున్న తన స్నేహితుడికి కాల్ చేశాడు. ఆ ఫ్రెండు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు! గ్రాఫ్ గీసి మరీ పంపాడు! అంతే.. ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు.. ఆ సలహా పంట రూపురేఖలనే మార్చేసింది.
ఇంతకూ ఏంటా ఐడియా!
సన్నదోమలు, రసం పీల్చే దోమలు, పేనుబంక టైపులో ఉండేవి పంటలకు చాలా డేంజర్! పంటను రాత్రికి రాత్రే పీల్చి పారేస్తాయి! ఒక్కసారి సోకాయంటే అంతే సంగతులు! అలాంటి సూక్ష్మక్రిములకు ఎల్ఈడీ లైట్ ఒక తరుణోపాయంగా మారింది. ఇంతకూ ఏంటీ లైట్ ఉపాయం? అక్కడికే వస్తున్నాం!
టబ్బులోని సబ్బునీళ్లలో పడుతున్న పురుగులు
L ఆకారంలో ఉండే స్టాండ్ ఒకటి తీసుకున్నాడు రామకృష్ణారెడ్డివ. దాని పై భాగంలో LED బల్బు అమర్చాడు. లైట్ వెలుతురు ఒకేచోట కేంద్రీకృతం అయ్యేలా దానికి ఒక టబ్ ఫిట్ చేశాడు. కింది భాగంలో మరో తొట్టి ఏర్పాటు చేశాడు. కింది తొట్టిలో సబ్బు నీళ్లు పోస్తాడు. సాయంత్రం ఆరు గంటలనుంచి రాత్రి 11గంటల వరకు లైట్లు ఆన్ చేసి పెడతాడు. ఈ లైట్లను ఆన్ ఆఫ్ చేసుకోవడానికి టైమర్ సెట్ చేశాడు. రాత్రిపూట లైటింగ్ కు ఆకర్షించి పురుగులు వచ్చి ఠపీమని ఆ సబ్బునీటి తొట్టిలో పడుతుంటాయి. ఉదయం వచ్చి ఆ నీటిలో పడ్డ పురుగులను తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా నీళ్లు పోస్తాడు. అలా అక్కడొకటి, అక్కడొకటి చేను మొత్తం అరెంజ్ చేశాడు. ఇంకేముంది సన్నదోమలు, రసంపీల్చే పురుగులు, ఇతరాత్రా పురుగులన్నీ పంటను ముట్టుకోకుండా వచ్చి టబ్బులోని సబ్బునీళ్లలో పడుతున్నాయి. పురుగుమందులు వాడకుండానే చీడపురుగుల రామకృష్ణారెడ్డి సమస్యకు ఇలా పరిష్కారం దొరికింది.
ఖర్చు పెద్దగా ఏం కాదు
ఒక్కోస్టాండుకైన ఖర్చు రూ. 500 అన్నీ స్థానికంగా దొరికే వస్తువులే,. ఆటోమెటిక్ టైమర్ ఉండటంతో కరెంటు కూడా ఆదా అవుతోంది. కృష్ణారెడ్డి పంట మొత్తం కవర్ చేసేందుకు అవసరమయిన పరికరాలు 12 లైట్లు, 12 స్టాండ్లు, 12 టబ్బులు, సరిపడా కరెంటు వైర్. మొత్తంగా రెండు ఎకరాలకు 15 వేల ఖర్చు వచ్చింది. వన్ టైం ఇన్వెస్ట్‌మెంట్. సెట్ చేసిన టైం ప్రకారం సాయంత్రం 6 గంటలకు లైట్స్ ఆన్ అవుతాయి. తిరిగి ఉదయం ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. ప్రతీ రాత్రి పురుగులు సర్ఫ్ నీటిలో పడి 80 శాతం చనిపోతున్నాయి. దీనివల్ల గతం కంటే పెట్టుబడి ఖర్చు తగ్గింది, దిగుబడి పెరిగిందని రైతు రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. రామకృష్ణారెడ్డి ఐడియా ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచింది. అందరూ రామకృష్ణారెడ్డి పొలం దగ్గరికి వచ్చి చూసి వెళ్తున్నారు.