సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్ లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎటుచూసినా నీళ్లే అన్నారు మంత్రి కేటీఆర్. K అంటే కాల్వలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు అని ఆయన అభివర్ణించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాన్ని ప్రారంభించారు మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హాజరయ్యారు.
దండగ అన్న వ్యవసాయం పండుగగా మారింది- KTR
హెలికాప్టర్లో వచ్చేటప్పుడు వరుసగా కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానేరు జలశయాలు కనపడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. కాళేశ్వరం జలాలతో నిండుకుండలా ఉన్న కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టును చూసి ముగ్ధులయ్యామని కేటీఆర్ అన్నారు. స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్ రెడ్డి, వినోద్ కుమార్ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అంటేనే రైతుబంధు అన్నారు కేటీఆర్. దండగ అన్న వ్యవసాయం పండుగగా మారిందని గుర్తు చేశారు.
విద్యార్థులు ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా, ఎంట్రప్రెన్యూర్లుగా మారాలని ఆకాంక్షించారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సాటిలైట్ క్యాంపస్, వ్యవసాయ కళాశాలను పీజీ సెంటరుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఆధునిక వ్యవసాయ కళాశాలలోని వసతులను సద్వినియోగం చేసుకుంటే దేశానికే గర్వకారణంగా నిలిచే ఆగ్రోనమిస్టులు తయారవుతారన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు.
వ్యవసాయ కళాశాలని చూసి ఈర్ష్య పడుతున్నా- మంత్రి నిరంజన్ రెడ్డి
ఆధునిక వసతులు, సాంకేతికత పద్దతులతో కూడిన కళాశాల రావడం విద్యార్ధుల అదృష్టమన్నారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక్కడి వ్యవసాయ కళాశాలని చూసి ఈర్శ్య పడుతున్నా అన్నారు. సమైక్య రాష్ట్రంలో సరిపడా భూములు ఉన్నా ధాన్యం కోసం వెంపర్లాడే పరిస్థితిని గుర్తుచేశారు. సిరిసిల్ల రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిచి, ఐఏఎస్ లకు పాఠంగా మారిందన్నారు. దేశంలో సరిపడా వ్యవసాయ కళాశాలలు లేవని అభిప్రాయపడ్డారు. దేశంలో మొత్తం 95 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే... ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు అయ్యిందన్నారు.
వ్యవసాయం పరిశ్రమగా తెలంగాణ రూపాంతరం వినోద్ కుమార్
అసమానతల పై పోరాడిన నేల స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారిందన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్. అమెరికా స్థాయిలో తెలంగాణలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. వ్యవసాయం పరిశ్రమగా తెలంగాణ రూపాంతరం చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యవసాయంలో రాబోయే సమస్యలపై విద్యార్థుల ఈ కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచే ఆలోచించాలని సూచించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తెచ్చిన భూసంస్కణలతో కమతాల విస్తీర్ణం తగ్గిందన్నారు.
పౌష్ఠికాహార భద్రతపై మరిన్ని పరిశోధనలు- ఎమ్మెల్యే రమేశ్
తెలంగాణ వచ్చాక వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్. సిరిసిల్లకు వ్యవసాయ కళాశాల వస్తుందని ఎవ్వరూ ఊహించలేదన్నారు. ఆహార భద్రత స్థానంలో పౌష్ఠికాహార భద్రత వచ్చిన దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పౌష్ఠికాహార భద్రతకు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. పౌష్ఠికాహార భద్రతపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. చిన్న జిల్లాలో వ్యవసాయ కళాశాల, మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వంటి గొప్ప మౌలిక సదుపాయాలు చేకూరాయని సంతోషం వ్యక్తం చేశారు.