రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎట్టకేలకు వ్యవసాయ కాలేజీ భవన ప్రారంభోత్సవం జరిగింది. బుధవారం (ఏప్రిల్ 12) మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఈ కొత్త కాలేజీని నిర్మించారు. ప్రారంభం అనంతరం మంత్రులు కొత్త భవన సముదాయాలను పరిశీలించారు. 


2018లో శంకుస్థాపన
2018 ఆగస్టు 9న ఈ వ్యవసాయ కాలేజీకి భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే ఏడాదిలో అడ్మిషన్లు కూడా ప్రారంభం అయ్యాయి. పీజీటీఎస్‌ఏసీ ఆధ్వర్యంలో ఎంసెట్‌ ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం కాగా, సర్దాపూర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిల్‌ కళాశాలలో క్లాసులను ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 56 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వారు 2022 ఆగస్టులో వ్యవసాయ డిగ్రీ పొంది బయటికి వచ్చారు. అలా ఒక బ్యాచ్ మొత్తం సొంత భవనం లేకుండానే పూర్తి అయింది. ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్‌లో 190 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 


తాజాగా కొత్త భవనంలోకి మార్చిన తర్వాత ఇక్కడ మరిన్ని వ్యవసాయ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి విభాగంలో 120 సీట్లకు అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ప్రస్తుతం 23 మంది బోధనా సిబ్బంది, 19 మంది బోధనేతర సిబ్బంది ఈ డిగ్రీ కళాశాలల్లో సేవలు అందిస్తున్నారు.


మంత్రుల వెంట అతిథులుగా శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి హాజరయ్యారు.