తెలంగాణలో లీకైన పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్టు అయి కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు బెయిల్ పై విడుదల అయ్యారు. ఏ2 - ప్రశాంత్, ఏ3 - మహేశ్, ఏ4 - గణేష్‌ నేడు (ఏప్రిల్ 12) ఉదయం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా నిందితుల్లో ఒకరైన ప్రశాంత్ మీడియాతో మాట్లాడాడు. పది హిందీ ప్రశ్నాపత్రం బయటకు రాగానే తాను ఓ జర్నలిస్టుగా జర్నలిస్టుల గ్రూపులో షేర్ చేశానని ప్రశాంత్ తెలిపాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పాడు. తనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు. బండి సంజయ్ తో తాను ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పాడు. 


పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారణమైన వారి గురించి విచారణలో భాగంగా తనకు తెలిసిన అన్ని వివరాలు చెప్పి పోలీసులకు సహకరించామని ప్రశాంత్ తెలిపాడు. ఒక జర్నలిస్టుగా తాను గతంలో విద్యార్థుల సమస్యలను బయటకు తెచ్చానని, వారి భవిష్యత్తు ఎలా పాడు చేస్తానని చెప్పాడు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహకారం అందించలేదని చెప్పాడు. కోర్టు నుంచే నేరుగా బెయిల్ పొందినట్లు చెప్పాడు.


ఏప్రిల్ 4న హిందీ పరీక్ష పేపర్ లీక్ కావడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ప్రశాంత్‌ అనే జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ పేపర్‌ను వాట్సప్‌లో ప్రశాంత్ పలువురికి షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా ఇంకొంత మందికి పేపర్ పంపినట్లు చెప్పారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ను ఉన్నట్టుండి గత వారం కరీంనగర్‌లో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ1 గా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించగా, బండి సంజయ్‌ను కరీంనగర్‌ జైలుకు తరలించారు. హన్మకొండ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. 


అలాగే నిన్న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటు బండి సంజయ్‌ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. తాజాగా కోర్టు ప్రశాంత్‌ సహా మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల అయ్యారు.