లిల్లీపువ్వు(రజనీగంధ) తన తెలుపు రంగుతో, సువాసనతో ఇట్టే ఆకర్షిస్తుంది. రజనీగంధ అంటే రాత్రిపూట సువాసనలు వచ్చేది అని అర్ధం. పేరుకు తగ్గట్లే ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఇది మెక్సికోలో పుట్టిందని.. పోర్చుగీసు వారు ఈ పువ్వును భారతదేశానికి తీసుకువచ్చారని పరిశోధకుల మాట.
ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. నేలపై కానీ, కుండీల్లో కానీ కాస్త సూర్యరశ్మి సహాయంతో దీన్ని పెంచుకోవచ్చు. బెంగళూరుకు చెందిన సేంద్రీయ తోటల పెంపక నిపుణుడు శ్రీరామ్ అరవముదన్ దీన్ని ఇంట్లో పెంచుకునేందుకు సులభమైన మార్గాలను సూచిస్తున్నారు.
1. దుంపలు సేకరించడం
నర్సరీ లేదా లిల్లీ పువ్వులు పెంచుతున్న వ్యక్తి నుంచి వాటి దుంపలను సేకరించాలి. ఇవి తేలిగ్గానే లభ్యమవుతాయి.
2. ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం
అవి సూర్యరశ్మిని ఇష్టపడే మొక్కలు. కాబట్టి రోజుకు కనీసం 5 నుంచి 6 గంటలపాటు సూర్యకాంతి ప్రత్యక్షంగా పడేలా చూసుకోవాలి. దానికోసం తగిన స్థలాన్ని ఎంచుకోవాలి.
3. సరైన మట్టి, కుండ అవసరం
దుంపలను నేలలో, కుండీలో నాటేటప్పుడు, మట్టి లేదా పాత్ర బాగా ఎండిపోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో దుంపలు కుళ్లిపోతాయి. 8 అంగుళాల కంటే పెద్ద కుండ అవసరం.
4. సరైన పోటింగ్ మిక్స్
ఎర్రమట్టి, కంపోస్ట్ మరియు కోకో పీట్ లను 2:1:1 నిష్పత్తిలో కలపడం ద్వారా కుండ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమం సాధారణంగా దాదాపు అన్ని తోట మొక్కలకు, ముఖ్యంగా పూలు పూసే మొక్కలకు బాగా పనిచేస్తుంది. ఆవుపేడతో కంపోస్టు ఎరువును తయారుచేసుకుని ఆ మొక్కలకు వాడాలి.
5. సరిగ్గా నాటాలి
రజనిగంధ నాటేటప్పుడు, దుంపకు, దుంపకు మధ్య స్థలం ఉండేలా చూసుకోవాలి. దాని వల్ల ప్రతి దుంపకు కావలసినంత పోషణ లభించి, బాగా మొలుస్తాయి.
6. ఎక్కువ నీరు వద్దు
దుంపలను నాటిన తర్వాత మట్టికి నీరు బాగా పోయాలి. మొక్క మొలకెత్తడానికి అవసరమైన తేమ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. దుంప మొలకెత్తిన తర్వాత మట్టి పొడిగా ఉన్నప్పుడు నీరు పోయాలి. వర్షం పడుతుంటే నీరు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దుంపలు నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందుకే ఎక్కవ నీరు అవసరం ఉండదు.
7. చీడపీడల నుంచి సంరక్షణ
నత్తలు ఇంకా ఏవైనా చీడపీడలు దాడి చేస్తే.. వాటిని తొలగించాలి. రసాయన మందులు వాడకూడదు.
లిల్లీ మొక్కలను నాటడానికి మార్చి- సెప్టెంబర్ నెలల మధ్య సమయం అనువైనది. ఎండ తగినంతగా ఉండదు కనుక శీతాకాలంలో వీటిని నాటకూడదు. మొక్క నుంచి పువ్వు రావడానికి 90 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. ఒకసారి పూయడం మొదలైన తర్వాత 3, 4 నెలలపాటు పూలు పూస్తూనే ఉంటాయి.
పూలు పూయడం పూర్తయిన తర్వాత ఆకులు, రెమ్మలు ఎండిపోతాయి. అయితే దుంప మాత్రం సజీవంగానే ఉంటుంది. వీటిని కోసి శుభ్రం చేసి నిల్వ చేసి తర్వాతి సీజన్ కోసం ఉపయోగించవచ్చు.