మల్లె పూలు మూరెంత..? అబ్బో అంత రేటా..? ఇదిగో కాస్త కొసరు వేయమ్మా..? మల్లెపూలు కొనే సమయంలో అందరూ అనే మాటలే ఇవి. కానీ ఆ మల్లె పూల వెనక రైతుల కష్టం ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆ కష్టం తెలిస్తే బేరం ఆడరు. కానీ ఆ కష్టాన్నంతా దళారులే దోచుకుంటారు కానీ, రైతులకు గిట్టుబాటయ్యేది చాలా తక్కువ. కానీ నేల రకాన్ని బట్టి, మల్లె తోటల సాగుని విడిచిపెట్టకుండా వస్తున్నారు రైతులు. నెల్లూరు జిల్లా రైతాంగం మల్లె తోటల్లో పడే కష్టం చూడండి. 


మల్లెపూలను మనం మార్కెట్ లో మూరల లెక్కన కొంటుంటాం కానీ, రైతులు మాత్రం వాటిని లీటర్ల చొప్పున అమ్ముతుంటారు. తోటల వద్ద లీటరు మల్లెపూలు 30 నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. అవే పూలు దళారుల చేయి దాటి.. వినియోగదారుల వద్దకు వచ్చే సరికి లీటరు 70 రూపాయల వరకు పలుకుతుంది. కష్టం రైతులది, లాభం దళారులది.




మల్లె తోటల్లో ముఖ్యంగా కూలీలకు ఎక్కువ ఖర్చు ఉంటుంది. పురుగు మందుల పిచికారీ కోసం, ఆకులు, కొమ్మల్ని తుంచడం కోసం, మల్లె మొగ్గల్ని కోసి రవాణా చేయడం కోసం కూలీలు అవసరం అవుతారు. దాదాపుగా తోటల యజమానులే కూలీలుగా పొలంలో పనిచేసుకుంటూ.. ఆ అదనపు ఖర్చు తగ్గించుకుంటారు. 


ఒండ్రు మట్టి నేలలు మల్లె సాగుకి అనుకూలం, పొడి ఇసుక నేలల్లో కూడా మల్లె తోటల్ని సాగు చేస్తుంటారు. నీరు ఎక్కువగా నిల్వ ఉంటే మాత్రం మొక్కలు కుళ్లిపోయి చనిపోతాయి. మల్లె మొక్కలు ఎలాంటి వాతావరణ ఇబ్బందులు లేకుండా ఉంటే 10-12 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది, పూలనిస్తుంది. సహజంగా వర్షాకాలం మొదలైన వెంటనే మొక్కల్ని నాటుతుంటారు. కొమ్మల్ని, ఆకుల్ని కత్తిరించడం ద్వారా కొత్త ఇగుర్లకు అవకాశం ఉంటుంది.


రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మల్లె తోటల సాగుకి మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో.. ఏపీలోని గుంటూరు, ప్రకాసం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో మల్లె తోటల్ని సాగు చేస్తున్నారు. పూల అలంకరణకు, పూల దండల దయారీకోసమే కాకుండా.. సువాసననిచ్చే పరిమళ ద్రవ్యాలు, సబ్బులు, నూనె, షాంపూ తయారీలోనూ మల్లె పువ్వుల్ని వాడుతుంటారు. 


మల్లెపూలకు పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కాస్త రేటు పలుకుతుంది కానీ, మిగతా రోజుల్లో మాత్రం రైతులకు పెద్దగా లాభం ఉండదు. ఇక కరోనా కాలంలో మార్కెట్ పూర్తిగా పడిపోయింది. మల్లె రైతులకూ కూడా ప్రభుత్వం దళారుల బెడద తప్పేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరుతున్నారు. మార్కెటింగ్ కి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.