NABARD Rural Financial Survey: అన్నం పెట్టి ఆకలి తీర్చే వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్న రోజులివి. కూరగాయలు రోడ్డు మీద, కాళ్లకు వేసుకునే చెప్పులు ఏసీ షోరూమ్‌ల్లో కనిపిస్తున్న కాలమిది. పెరిగిన పారిశ్రామికీకరణతో వ్యవసాయాదరణ తగ్గిపోతోంది. కాల్వలు, చేలు, చెరువులు నివాస స్థలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. పల్లె జనం కాడిని వదిలేసి పట్నం కాడికి వలసలు పోతున్నారు. "ఇప్పుడు ఈ మాత్రమైనా తిండి దొరుకుతోంది, భవిష్యత్‌ తరాలు మాత్రలతో ఆకలి తీర్చుకోవాల్సిందే" అనే మాటలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. కాలంతో పాటు వ్యవసాయం కరిగి కనుమరుగవుతోందన్న బెంగతో చెప్పే మాటలివి. అయితే, ఈ మనోవేదనను మరిపించే తీపికబురును నాబార్డ్‌ (National Bank for Agriculture and Rural Development) చెప్పింది. 


తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాల సంఖ్య మళ్లీ పెరుగుతోందని నాబార్డ్‌ ప్రకటించింది. 'నాబార్డ్‌ రూరల్‌ ఫైనాన్షియల్‌ సర్వే'లో (NABARD Rural Financial Survey) ఈ విషయం వెల్లడైంది. 2016–17లో నాబార్డ్‌ చేపట్టిన రూరల్‌ ఫైనాన్సియల్‌ సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా 48 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. 2021–22లో చేపట్టిన సర్వే ప్రకారం ఆ సంఖ్య 57 శాతానికి పెరిగింది. అంటే, కేవలం 5 సంవత్సరాల్లో, దేశంలో వ్యవసాయం చేస్తున్న కుటుంబాల సంఖ్య 9 శాతం పెరిగింది. ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సంఖ్య కాలక్రమేణా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


వాతావరణ మార్పుల వల్ల హఠాత్తుగా వచ్చిన పడే కరవుకాటకాలు & వరదల తాకిడిని తట్టుకోలేక, ఒకప్పుడు, కర్షకులు కాడిని వదిలేశారు. ఇప్పుడు కూడా అవే ప్రతికూలతలు ఉన్నప్పటికీ... వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికతలతో నష్టభయం తగ్గింది. కరవు, వరదలను తట్టుకునే మేలైన విత్తనాలు, చీడలను దరి చేరనివ్వని పురుగు మందులు, దిగుబడిని పెంచే బలం మందులు, ఇతర అధునాతన పంట యాజమాన్య పద్ధతులు గ్రామస్థాయికి కూడా చేరాయి. దీంతో, వదిలేసిన కాడిని తిరిగి భుజానికి ఎత్తుకుంటున్న కర్షక కుటుంబాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గ్రామాల్లో అత్యధిక కుటుంబాలు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాయి. 


ఏపీలో ఐదేళ్లలో 19 శాతం వృద్ధి
నాబార్డ్‌ సర్వే ప్రకారం, 2016–17లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉన్నాయి. 2021–22 గణాంకాల ప్రకారం, మొత్తం కుటుంబాల్లో సగానికి పైగా, అంటే 53 శాతం కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో, ఈ ఐదేళ్ల కాలంలో (2016–17 నుంచి 2021–22 వరకు) వ్యవసాయ కుటుంబాలు ఏకంగా 19 శాతం పెరిగాయి. తెలంగాణలో, మొత్తం 55 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయి. 


తొలి 2 స్థానాల్లో లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్  
దేశంలో అత్యధికంగా, లద్దాఖ్‌లో 75 శాతం కుటుంబాలు, జమ్ముకశ్మీర్ 73 శాతం కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి. అత్యల్పంగా.. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే అగ్రికల్చర్‌ ఫీల్డ్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, తెలుగు రాష్ట్రాలతో కలిపి, దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు పొలం బాటలో ఉన్నాయని నాబార్డ్‌ సర్వేలో వెల్లడైంది.


మరో ఆసక్తికర కథనం: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌