బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను సిక్కోలు రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికి అందిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానాపాట్లు పడుతున్నారు. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్న అధికారుల సమాచారంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. పొలాల్లో కోసిన వరిని, కల్లాల్లో నూర్చేందుకు రెడీ చేసిన పంటను కాపాడుకోవడానికి శ్రమిస్తున్నారు. పండిన పంటను కోతలు కోసి కుప్పలుగా పేరుస్తున్నారు. కుప్పలపై టార్పా లిన్లు కప్పి సంరక్షించుకుంటున్నారు. కల్లాల్లో ఇప్పటికే కోసి ఆర బోసిన ధాన్యం రాశులను బస్తాల్లో ఎత్తి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వర్షాలు పడే అవకాశం ఉన్నందున వ్యవసాయాధికారులు మాత్రం వరి పంటను రెండు రోజులు పాటు కోయవద్దని సూచిస్తు న్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో మాండౌస్ తుపాను మరింత కుంగదీస్తోంది. చాలామంది రైతులు ధాన్యం సిద్ధం చేసి అమ్మేందుకు సన్నద్ధమైనా నిబంధనల పేరిట అధికార యంత్రాంగం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు రంగంలోకి దిగారు. శుక్రవారం కలెక్టర్ ఏకంగా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేయగా జాయింట్ కలెక్టర్ కూడా జిల్లాలో పలుప్రాంతాల్లో పర్యటించి - మిల్లులు, ఆర్బీకేల వద్ద ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు.
ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ఆన్లైన్ పద్ధతి లో కొనుగోలు చేసి నగదు కూడా అదే పద్ధతిన వారి ఖాతాల్లో వేయాలని పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనిపై గత కొద్ది రోజులుగా జిల్లా యంత్రాంగం సచివాలయ సిబ్బందికి తర్ఫీదు ఇచ్చినప్పటికీ సాంకేతిక లోపాల నుంచి బయట పడలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చిన తుపాను రైతులను నిలువునా ముంచేసింది. రెండు రోజులుగా జిల్లా అంతట చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.
ఆరుగాలం పండించిన పంట వర్షాలతో నష్టపోతామన్న భయంతో రైతులు వణికిపోతున్నారు. వర్షానికి తోడు చలిగాలులు వీస్తుండ డంతో పంటను సురక్షిత ప్రాంతాలకు తరలిం చేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ధాన్యాన్ని తడవకుండా రైతులు కాపాడుకోలేకపోయారు. తడిచిన ధాన్యాన్ని అధికారులు కొంటారా కొనరా అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.
అధికారులు మాత్రం ఆందోళన చెందవద్దని రైతులకు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, కనీస మద్దతు ధర కల్పిస్తామంటున్నారు. జిల్లాలో 613 ఆర్బీకేలు ఉండగా ఇప్పటివరకు 175 కేంద్రాల నుంచి 7,091.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొనుగోలుకు కావలసిన సిబ్బంది, గోనె సంచులు, ధాన్యం నాణ్యత ప్రమాణాలను కొలిచే పరికరాలు అన్ని రెడీగా ఉన్నాయన్నారు. రైతులు కనీస మద్దతుధర పొందడానికి ధాన్యాన్ని బాగా ఆరబెట్టుకొని శుభ్రం చేసి దగ్గరలో ఉన్న కొనుగోలు కేంద్రంలో తెలియజేయాలన్నారు.
తమ ధాన్యానికి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర కంటే ఎక్కువ ధర బహిరంగ మార్కెట్‌లో వస్తే అమ్ముకోవచ్చని అధికార యంత్రాంగం ప్రకటించింది. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు 95058 23016, 91777 44402, 77805 61968, 99634 79141కు తెలియజేయాలన్నారు.