Nirmal News: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు మరోసారి వార్తాల్లోకి హాట్‌టాపిక్ అవుతోంది. అప్పుడూ ఇప్పుడూ ప్రజలకు మాత్రం టెన్షన్ తప్పడం లేదు.  ఈ ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకీ తగ్గుతోంది. ఇదే ఇప్పుడు ప్రజలక ఆందోళనకు కారణమవుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు, నిల్వ సామర్థ్యం 7.603 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 683.175 అడుగులు ఉంటే 3.992 టిఎంసిలు నీరు నిల్వ ఉంది.


అప్పుడో టెషన్


7నెలల కిందట భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు నిండిపోయి గేట్లు తెరుచుకోక వరద గేట్లపై నుంచి పారింది. కడెం ప్రాజెక్టు కూలిపోతుందని అందరు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు హ్యాండిల్ ద్వారా గేట్లు ఎత్తారు. అలా ఎట్టకేలకు పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు ప్రత్యేక ఇంజనీర్లతో గేట్లకు మరమ్మతులు చేపట్టారు. తర్వాత 15వ గేటు వద్ద కౌంటర్ వెయిట్, రోప్ తెగి పడిపోవడంతో లీకేజీతో నీళ్ళు వృథాగా పోయాయి. 




ఇప్పుడో టెన్షన్


ఇప్పుడు మాత్రం ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేక రైతులు టెన్షన్ పడుతున్నారు. ఈ యేడాది కడెం ప్రాజెక్టులో నీళ్ళు లేకపోవడంతో అధికారులు కాలువలోకి నీళ్లు వదలేకపోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీళ్ళు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు రబీ సీజన్‌కు కడెం నుంచి కాల్వలకు నీటిని విడుదల చేయడం లేదని రైతులు వాపోతున్నారు. కడెం పంప్ హౌస్ నుంచి పెంబి, కడెం, ఖానాపూర్‌, దస్తూరాబాద్‌, జన్నారం ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీటిని పంపింగ్‌ చేయడం వల్ల తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 




ఏబీపీ దేశం వద్ద రైతుల గోడు 


ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 683 అడుగులకు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకుంటే గేట్ల లీకేజీ వల్ల కొంత నీరు దిగువకు ప్రవహిస్తోంది. కొంతమంది రైతులు పంటలు కాపాడుకోవడానికి బోర్లు, బావులపై ఆధారపడతారు. ఎలాంటి నీటి సోర్స్ లేని రైతులు పంటలు వేయలేకపోతున్నారు. 
కడెం ప్రాజెక్టు కెనాల్ ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని 68వేల ఎకరాల ఆయకట్టుకు ఏటా సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్టులో రోజురోజుకు నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో రబీ సాగుకు సాగునీరు అందడంలేదని అయకట్టు రైతులు abp దేశం వద్ద గోడు వెల్లబోసుకున్నారు.




లీకేజీలు అరికట్టాలని డిమాండ్


శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు కాలువను కడెం కాలువకు అనుసంధానం చేస్తే స్థానిక రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కడెం ప్రాజెక్ట్ కెనాల్ కడం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపెట్, మంచిర్యాల మండలాల్లోని ఎడమ కాల్వ కింద 66,450 ఎకరాలు, కుడి కాలువ కింద 1,700 ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ లీకేజీలు ఇతర కారణాలతో దాని ఆయకట్టు తగ్గింది. 




వేసవిలో మరమ్మతులు చేయాలని సూచన 


ఇరిగేషన్ అధికారులు ఈ వేసవిలో ప్రాజెక్టు, గేట్లకు మరమ్మతులు చేపట్టాలని, ఎడమ కాల్వకు మరమ్మతు పనులు చేపట్టాలని, తద్వారా లీకేజీలు అరికట్టడంతోపాటు పూర్తిగా సాగునీరు అందే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ వేసవిలోనే మరమ్మతు చేస్తే వచ్చే వర్షాకాలంలో ఎంతటి పెద్ద వరద వచ్చినా డ్యాంకు ప్రమాదం ఉండదని రైతులు, స్థానికులు అంటున్నారు. 




నోడు మెదపని అధికారులు 


ఈ విషయంపై అధికారులు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. గత వర్షకాలంలో కడెం ప్రాజెక్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడారని ఓ అధికారికి నోటీసులు వచ్చాయి. అప్పటి నుంచి ఏ అధికారి కూడా ప్రాజెక్టు గురించి వాయిస్ ఇవ్వడం లేదు. మరీ దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.