Telangana CM Revanth Reddy conference with collectors: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Government) దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు హామీల అమలుపై చర్యలు చేపట్టింది. మరోవైపు అధికారుల బదిలీలు, మరికొందరికి పోస్టింగ్స్ లతో పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలపై మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం కానున్నారు. డిసెంబర్ 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని, కలెక్టర్లు అంతా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. 


భూ రికార్డులకు సంబంధించిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుకు సంబంధించి చర్చించనున్నారని తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుతో పాటు మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లోపాలు, వైఫల్యాలను సైతం బయట పెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణి వెబ్ సైట్ కు సంబంధించి లక్షకు పైగా ఫిర్యాదులు ఉండటంపై సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్, అధికారులు పూర్తి నివేదిక అందిస్తే త్వరలోనే ఉన్నతస్థాయిలో ధరణిపై సమీక్ష జరుపుతామని స్పష్టం చేశారు.