Telangana Minister Seetakka : వరంగల్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ములుగు జిల్లా (Mulugu District)కు వచ్చిన సీతక్కకు ఘనస్వాగతం లభించింది. పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం శాఖల మంత్రిగా సీతక్క ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రిగా ములుగు జిల్లాకు వెళ్లిన సీతక్కకు కాంగ్రెస్ పార్టీ (Congress party) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ములుగు నియోజక వర్గం చేరుకున్న మంత్రి సీతక్కకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ములుగు జిల్లాలోని మహమ్మద్ గౌస్ పల్లి వద్ద సీతక్కకు భారీ గజమాల వేసి, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను..
భారీ మెజారిటీతో తనను గెలిపించి, అత్యున్నత హోదా మంత్రిని చేసిన ములుగు ప్రజలందరికి రుణపడి ఉంటానని మంత్రి సీతక్క అన్నారు. ములుగు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పుడు మరిచిపోనని అన్నారు. మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాల తరువాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో, నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
అక్కడి నుంచి గట్టమ్మ దేవాలయం వరకు దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. గట్టమ్మను దర్శించుకని మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి సీతక్క మేడారం వెళ్లారు. మేడారం జాతర నిధుల కేటాయింపులపై ఆరోపణలు వస్తున్నాయని.. ఇప్పుడు ఇచ్చిన 75 కోట్ల నిధులు గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినవేనని సీతక్క తెలిపారు. మేడారంలో త్వరలో నిర్వహించబోయే తెలంగాణ కుంభమేళా జాతరపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించనున్నారు.
తాను ఏ స్థాయిలో ఉన్నా ములుగు ఆడబిడ్డనేనని, నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడతా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారంటీలపై సంతకం చేశాం, త్వరలో మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలు మాత్రమే అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.