Indian Student Missing in UK:  


భారతీయ విద్యార్థి అదృశ్యం..


యూకేలో Loughborough Universityలో చదువుతున్న భారతీయ విద్యార్థి (Indian Student Missing) జీఎస్ భాటియా అదృశ్యమయ్యాడు. డిసెంబర్ 15 నుంచి కనిపించకుండా పోయాడు. బీజేపీ నేత మన్‌జిందర్ సింగ్ సిస్రా (Manjinder Singh Sirsa) ఈ విషయం వెల్లడించారు. ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...డిసెంబర్ 15వ తేదీన భాటియా చివరి సారి ఈస్ట్‌లండన్‌లో కనిపించాడు. అప్పటి నుంచి ఆచూకీ లేదు. యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు ఇండియన్ హై కమిషన్ కార్యాలయం కూడా చొరవ చూపించి భాటియా జాడ కనుగొనేందుకు సహకరించాలని కోరారు మన్‌జిందర్ సింగ్. 


"లఫ్‌బోరో యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి GS భాటియా డిసెంబర్ 15 నుంచి కనిపించడం లేదు. చివరిసారి ఈస్ట్‌లండన్‌లోని కానరీ వార్ఫ్‌ వద్ద కనిపించాడు. ఈ ఘటనపై ప్రత్యేక చొరవ చూపించాలని జైశంకర్‌ని కోరుతున్నాను. యూనివర్సిటీ యాజమాన్యమూ పట్టించుకోవాలి. మీ సాయం చాలా కీలకం. వీలైనంత వరకూ అందరికీ ఈ విషయం తెలియజేయండి"


- మన్‌జిందర్ సింగ్ సిస్రా, బీజేపీ నేత




గతంలోనూ ఓ విద్యార్థి మిస్సింగ్..


ఇదే ట్వీట్‌లో భాటియా రెసిడెన్స్ పర్మిట్‌తో పాటు కాంటాక్ట్ నంబర్స్ కూడా షేర్ చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వివరాలు తెలియజేయాలని కోరారు. గతంలోనూ 23 ఏళ్ల భారతీయ విద్యార్థి మిత్‌కుమార్ పటేల్ అదృశ్యమయ్యాడు. చివరికి థేమ్స్‌ నదిలో శవమై తేలాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చదువుకునేందుకు లండన్‌కి వచ్చిన మిత్‌కుమార్‌ నవంబర్‌లో చనిపోయాడు. అయితే..ఇది అనుమానాస్పద మృతి కాదని పోలీసులు వెల్లడించారు.