భారీ వర్షాల కారణంగా ఈసారి మొక్కజొన్న ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. వర్షాలకు మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల పంట రావాలి. కానీ ఈసారి 2 నుంచి మూడు క్వింటాళ్లే వచ్చింది. పంట చేతికి వచ్చే సమయంలో కంటిన్యూగా కురిసిన వర్షాలకు పంటదిగుబడి భారీగా తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ డివిజన్‌లో మొక్కజొన్న పంటను ఎక్కువగా పండిస్తారు. మొక్కజొన్న సాగులో ఆర్మూర్ డివిజన్ ఎప్పుడూ టాప్‌లొనే ఉంటుంది. ఏ సీజన్‌లో అయినా పండించేందుకు వెనుకాడరు ఇక్కడి రైతులు. ప్రధానంగా అంకాపూర్‌లో మక్క పంటను రైతులు ఎక్కువగా పండిస్తారు. ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. మొక్క జొన్న పంట వైపు రైతులు ఎక్కువ ఆసక్తి చూపలేదు. 25 వేల ఎకరాలు మించి సాగు కాలేదని వ్యవసాయ శాఖ లెక్కలు. మరోవైపు కొన్ని చోట్ల వర్షాలకు మక్క పంట బాగా దెబ్బతింది. అయితే అంకాపూర్‌లో ఈసారి మొక్కజొన్నకు భారీగా డిమాండ్ పెరిగింది. అంకాపూర్ పసుపు పంటతోపాటు మొక్కజొన్న పంటకు కూడా బాగా ఫెమస్.


భారీగా తగ్గిన దిగుబడి 


ఆర్మూర్ డివిజన్‌లో ఈసారి 8 వేల ఎకరాల్లో మాత్రమే మక్క దిగుబడి వచ్చింది. ప్రతి ఏటా ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల మొక్క జొన్న దిగుబడి వచ్చేది. ఈసారి కురిసిన భారీ వర్షాలకు దిగుబడి బాగా తగ్గి... ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో మక్కకు భారీగా డిమాండ్ పెరిగింది. గతేడాది క్వింటాకు ధర రూ.1400 పలికింది. ఈసారి క్వింటాకు రూ. 2,300 పలుకుతోంది. చిరు వ్యాపారుల వద్ద కాల్చిన ఒక్క మొక్క జొన్నను రూ. 15 నుంచి రూ.20కి విక్రయిస్తున్నారు.  


ప్రస్తుతం మక్కకు అంకాపూర్ మార్కెటే దిక్కు....


అంకాపూర్ మార్కెట్‌లో ప్రస్తుతం మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది. ఆర్ముర్ డివిజన్‌లో పండే మక్కను అంకాపూర్ మార్కెట్‌లొనే విక్రయిస్తారు. ఇక్కడ మహారాష్ట్ర నుంచి అలాగే చుట్టు పక్కల జిల్లాలకు మొక్కజొన్న ఎగుమతి అవుతుంది. మొక్కజొన్న కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారులు అంకాపూర్ మార్కెట్ నుంచే కొనుక్కొని వెళతారు. ఈసారి మక్క దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ఉన్న ధర వల్ల మొక్కజొన్న పండించిన రైతులకు కాస్త ఊరట కలిగింది.