గోరింటాకు చేతులకు పెడితే ఎంతందంగా ఉంటాయో. అలానే తలకు రాసుకుంటే తెల్లజుట్టు మాయమవుతుంది. పెళ్లిళ్లు, పండుగలు, వ్రతాలు, ఉత్సవాలు.. వేడుక ఏదైనా ఆడవారి చేతిపై గోరింట పండాల్సిందే. ఇది కేవలం అందానికి మాత్రమే కాదు.. ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో. హెన్నా, మెహందీ, లాసోనియో ఇనర్మిస్ ఇలా పేరు మారినా.. దాని రూపం మాత్రం ఒకటే. 


ప్రతి భాగం ఉపయోగకరమే


గోరింటాకు ఒక సహజమొక్క. దీని ఆకులు, పువ్వులు, విత్తనాలు, బెరడు ఇలా ఈ మొక్కలోని ప్రతి భాగం ఉపయోగకరమైనదే, ఔషధ గుణాలు కలిగి ఉన్నదే. ఇది ఒక శాశ్వత పొద లాగా ఉంటుంది. దీని సువాసన కారణంగా మద్యంతిక అని కూడా పిలుస్తారు. ఇది సహజ రంగుకు ప్రధాన వనరు. హెన్నా ఆకుల్లో లాసోన్ అనే వర్ణద్రవ్య సమ్మేళనం ఉంటుంది. ఈ మొక్కలో గల వ్యాధి నివారణ లక్షణాలను ఆయుర్వేదంలో నిర్వచించారు. చేతులు, జుట్టు అందాన్ని పెంచడమే కాక అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తుంది. గోరింటాకు మొక్కను వాణిజ్య పరంగా ఆకుల ఉత్పత్తి కోసం పెంచుతారు. ఈ సాగు విధానం, ఇందులోని రకాలు, దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


గోరింటాకు (మెహందీ, హెన్నా) సాగు ప్రయోజనాలు



  • రుతుపవనాల అనిశ్చితిలో, హెన్నా స్థిరమైన ఆదాయాన్ని అందించే బహుముఖ పంట.

  • పరిమిత ఎరువులు, కనీస పర్యవేక్షణ, వర్షాధారంతో ఈ పంటను పండించవచ్చు. 

  • గోరింటాకు పంట మట్టి కోతను నిరోధిస్తుంది. అలానే మట్టిలో నీటి సంరక్షణను పెంపొందిస్తుంది. 

  • హెన్నాను సౌందర్య సాధనంగా ఉపయోగించడం వలన దీనిని మార్కెట్ చేయడం సులభం.

  • ఈ పంటను ఒకసారి వేస్తే కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచవచ్చు. ఏటా దిగుబడి, ఆదాయం వస్తుంది. ఒకసారి నాటితే మరలా నాటనవసరం లేదు. 

  • గోరింటాకు మొక్క చుట్టుపక్కల పరిసరాలను పరిమళభరితంగా ఉంచుతుంది.

  • హెన్నా ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధ మొక్క.


భూమి తయారీ


వర్షాకాలానికి ముందే పొలాన్ని దున్ని సిద్ధంగా ఉంచుకోవాలి, దున్నిన తరువాత చదును చేసుకోవాలి. ఆరోగ్యకరమైన, వెడల్పాటి, దట్టమైన హెన్నా మొక్కల నుంచి విత్తనాలు సేకరించి, ఎండలో ఆరబెట్టాలి. కొమ్మలు సన్నగా, తిన్నగా పెరిగే దేశీయ రకాలు సాగుకు అనువైనవి. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎంచుకోవాలి. 


విత్తడం మరియు నాటడం 


ఫిబ్రవరి-మార్చిలో (వాతావరణ ఉష్ణోగ్రత 25-30 °C ఉన్నప్పుడు) గోరింటాకు విత్తనాలు చల్లాలి. ఆ తర్వాత జూలై-ఆగస్టులో వాటిని నాటాలి. హెన్నాను నేరుగా విత్తనం ద్వారా లేదా నారుమడిలో నాటడం ద్వారా లేదా అంటుకట్టుట పద్ధతి ద్వారా పెంచవచ్చు. అయితే వాణిజ్య వ్యవసాయానికి నాటే పద్ధతి ఉత్తమమైనది.


ఎరువుల వాడకం


పొలాన్ని చివరిగా దున్నే సమయంలో ప్రతి హెక్టారుకు 8-10 టన్నుల సేంద్రీయ ఎరువును మట్టిలో కలపాలి. హెక్టారుకు 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం మొక్కలకు వేయాలి. వర్షం కురిసిన తర్వాత, కలుపు తీసే సమయంలో పూర్తి పరిమాణంలో నత్రజని, దానికి సగం భాస్వరం కలిపి మట్టిలో వేయాలి. తర్వాత ప్రతి హెక్టారుకు 40 కిలోల నత్రజనిని మొక్కల వరుసలలో చల్లాలి. 


కోత


సాధారణంగా హెన్నా మొక్క సంవత్సరానికి 2 సార్లు కోతకు వస్తుంది. నాటిన తర్వాత మార్చి- ఏప్రిల్, తర్వాత నవంబర్- అక్టోబరులో కోతకు వస్తుంది. కోసిన తర్వాత గోరింటాకు ఆకులను సంచుల్లో నిల్వచేయాలి. ఆకు కాండాలను ఎండలో ఉంచకూడదు. 


దిగుబడి


సాధారణ పరిస్థితుల్లో, అధునాతన పంట పద్ధతులను అవలభించడం ద్వారా ఏడాదికి 15 నుంచి 16 క్వింటాళ్ల ఆకును దిగుబడిగా పొందవచ్చు. నాటిన మొదటి 2, 3 సంవత్సరాల్లో 7- 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.