Rains in Telangana AP: ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో కొనసాగుతూ సముద్ర మట్టంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కుతోంది.
తెలంగాణలో తేలికపాటి వర్షాలు
రాష్ట్రానికి ఆగస్టు 5 వరకు వర్ష సూచన ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. ఉక్కపోత అధికం కానుంది. అయితే కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు చాలా తక్కువగా ఉంది. శనివారం, ఆదివారం ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఆగస్టు 5 నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి జల్లులు పడతాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాయలసీమలో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. కృష్ణా, గుంటూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ చినుకులు పడతాయి. దక్షిణ కోస్తాంధ్రలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.