మిరపకాయలు తమ ఆహారానికి మసాలాగా జోడించే పదార్థాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మిరపకాయలు లేకపోతే భారతీయుల ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. ఇక ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి పైగానే రోజూ మిర్చి తింటుంటారు. ప్రజలు తాము వండుకునే వంటకాల్లో తప్పక మిర్చీ ఫౌడర్, లేదా మిర్చిని వాడుతుంటారు. దీని కారణంగా వంటలు రుచిగా, ఘాటుగా కూడా ఉంటాయి. క్యాప్సికమ్ జాతికి చెందిన ఈ మిరప.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనిని అనేక వంటలలో ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ప్రత్యేక వంటకంగా తింటారు. అయితే మిరపకాయ కారంగా ఉండటం వెనుక ఉన్న సైన్స్ ఏంటి.? అసలు మిరపకాయలు ఎక్కడ పుట్టాయి.? అలాగే మిర్చీకి ఓ చరిత్ర కూడా ఉందన్న విషయం మీకు తెలుసా.?


మిరపకాయ హిస్టరీ:
అమెరికాలోని ప్రజల ఆహారంలో మిరపకాయలు భాగం కావడమనేది దాదాపు క్రీ.పూ. 7500 నాటినుంచే ప్రారంభమైంది. పురాతత్వశాస్త్ర సాక్ష్యాధారాల ప్రకారం.. నైరుతి ఈక్విడార్‌లో కొలువై ఉన్న ప్రాంతాల్లో 6000 సంవత్సరాలకు పైగా కాలం నుంచి మిరపకాయల పెంపకం అమలులో ఉందంటా. దక్షిణ అమెరికాల్లో మొట్టమొదట సాగు చేయబడిన పంటల్లో మిరప కూడా ఒకటి. అయితే 1492 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ కొత్త ప్రపంచాన్ని కనుగొనే వరకు మిరపకాయ గురించి ప్రపంచంలోని చాలా మందికి తెలియదు. దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి మిరపకాయ వచ్చినట్లుగా చెబుతారు. ఫైలోజెనెటిక్ విశ్లేషణలో అవి పశ్చిమం నుండి వాయువ్య దక్షిణ అమెరికా వరకు అండీస్‌తో పాటు ఒక ప్రాంతానికి చెందినవని కనుగొన్నారు. అప్పట్లో ఇవి చిన్న ఎరుపు, గుండ్రని, బెర్రీ లాంటి పండ్లు. అయితే ఇలా కనుగొన్న సమయంలో మిర్చీని "పెప్పర్స్" అని సంబోధించారు. ఇతర ఆహారపదార్థాల మాదిరిగా కాకుండా కారంగా ఘాటైన రుచితో యూరోప్‌లో అప్పటికే సుపరిచితమైన పిపెర్ తరగతికి చెందిన నలుపు, తెలుపు పెప్పర్ వలే ఉండడమే అందుకు కారణం. దీని తర్వాత యూరోప్‌లో పరిచయమైన మిరపకాయలు స్పానిష్, పోర్చుగీసు మఠాలకు చెందిన తోటల్లో ఔషధపరమైన మొక్కలుగా పెంచబడేవి. అయితే, సదరు మఠాల్లో ఉండే సన్యాసులు ఈ మిరపకాయలను వంట సంబంధిత అంశాల్లో ప్రయోగించి చూడడంతో పాటు మిరపకాయల్లో ఉండే కారం అనే గుణం నల్ల మిరియాల ఉపయోగానికి ప్రత్యామ్నాయంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఆ తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో మిరపకాయలను వంటలకు ఉపయోగించడం మొదలైన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పట్లో ఆసియాతో వాణిజ్య సంబంధాలు నెరుపుతున్న స్పానిష్ కాలనీ అయిన మెక్సికో నుండి మిరపకాయలు మొదట ఫిలిప్పైన్స్‌కు వ్యాపించడంతో పాటు అటుపై భారతదేశం, చైనా, ఇండోనేషియా, కొరియా, జపాన్‌లకు సైతం వేగంగా విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా మిరపకాయల జాతులు మొత్తం ఐద రకాలు ఉన్నాయి. వీటిలో మొదటిది క్యాప్సికం అన్నూం. క్యాప్సికం ఫ్రూట్‌సెన్స్‌, క్యాప్సికం చైనెన్స్‌, క్యాప్సికం పుబెసీన్స్‌, క్యాప్సికం బకాటమ్‌. ఒక్కో జాతి ఒక్క దేశంలో పండుతాయి. 


మిర్చీ ఎందుకని కారణంగా ఉంటాయి.?
క్యాప్సైసిన్ సహజంగా మిరపకాయ మరియు మిరపకాయ గింజలలో కనిపిస్తుంది. ఇది మిరపకాయలు కారం, వేడి రుచిని కలిగిస్తుంది కాప్సైసిన్ నాలుక, చర్మంపై సిరలపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో క్యాప్సైసిన్ రక్తంలో సబ్‌స్టాన్స్ పి అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది మెదడులో మంట, వేడిని స్పందింపజేస్తుంది. అందుకనే మిరప తిన్న వెంటనే లేదా కొంచెం సేపటికి ఒక వ్యక్తి మంట వేడిని ఫీల్ అవుతాడు. అయితే మిర్చీని తిన్న వెంటనే కారం అవుతుంది. ఇలా కారం అయిన సమయంలో టక్కున ఎవరికి అయిన గుర్తు వచ్చేది.. నీళ్లు తాగడం. కానీ కారం అయినప్పుడు నీళ్లు తాగడం వల్ల కారం తగ్గదు. ఎందుకంటే .. మిరపలో ఉన్న క్యాప్సైసిన్ నీటిలో కరగదు కనుక మంట తగ్గదు. అందువలన మిరపకాయతో నోరు మండినా.. చేతులు మంట వచ్చినా.. ఆ మంటను తగ్గించడానికి పాలు, పెరుగు, తేనె లేదా చక్కెరను ఉపయోగించాలి.