New Year gift to farmers: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. వారి నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది. కొత్త సంవత్సరంలో ఆ డబ్బులను విడుదల చేయనున్నారు. 2023 ప్రారంభంలోనే కొత్త సంవత్సర కానుకగా 13వ వాయిదా డబ్బులను రైతులకు చెల్లించేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 1, 2023నే రైతుల ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పీఎం కిసాన్ యోజన సొమ్ము కోసం రైతులు ఈ కేవైసీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఎవరైనా కేవైసీ చేయనివారు ఉంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు ఇవ్వవచ్చు. లేదంటే 13వ విడత డబ్బులు వారికి రావు.
ఈ- కేవైసీ ఇలా చేయాలి
- ముందుగా అధికారిక వెబ్ సైట్ (https://pmkisan.gov.in) కి వెళ్లాలి.
- ఈ-కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అక్కడ ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
- ఇమేజ్ కోడ్ ను నమోదు చేసి, సెర్ట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి, ఓటీపీని టైప్ చేయాలి.
- మీరిచ్చిన అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లే.
- ఒకవేళ వివరాలు సరిగ్గా లేకుంటే ఈ- కేవైసీ పూర్తవదు.
జనవరి 1న 13వ విడత డబ్బులు!
జనవరి 1, 2023న పీఎం కిసాన్ 13వ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ తేదీను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. PM కిసాన్ పథకం కింద, రైతులకు ఏప్రిల్ 1 నుండి జూలై 31 మధ్య కాలానికి మొదటి విడత డబ్బు ఇస్తారు. రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు బదిలీ చేస్తారు. ఇక మూడో విడత డబ్బు డిసెంబర్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈసారి అది ఆలస్యమైంది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి చిన్న మరియు మధ్య తరగతి రైతులకు ఏటా రూ. 6,000 రూపాయలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు 12 విడతల డబ్బులు విడుదల చేశారు.