రైతు ఉత్పత్తి సంస్థల్లో రైతులు విరివిగా చేరాలన్నారు కేంద్రమంత్రి శోభా కరంద్లజే. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె...
గార్లదిన్నె మండలంలోని దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ సంస్థలను సందర్శించారు. కేంద్ర సహాయ మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, సదరన్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కెకె నాగ్లే ఉన్నారు. అక్కడ ఇంజన్ టెస్టింగ్ ల్యాబ్‌ను, తయారయ్యే పరికరాల గురించి కేంద్ర సహాయ మంత్రి ఆరా తీశారు. సంస్థలో అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిక్షణ సంస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న రైతులతో ముచ్చటించారు. 


ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు కేంద్రంత్రి శోభ. అందుకు తగ్గట్టుగానే రైతులు సహకరించాలని కోరారు. రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసుకున్నవారికి కార్యాలయం, సిబ్బంది ఏర్పాటు, మౌలిక వసతులు, ఉత్పత్తుల ఎగుమతులు, మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ కోసం 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తోందన్నారు. 


ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు రైతు ఉత్పత్తి సంస్థలలో 300 మందికి తక్కువ కాకుండా రైతులు చేరాలన్నారు శోభ. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువులపై ఒక బ్యాగుకు 1,200 రూపాయల సబ్సిడీని అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున రైతులు అకౌంట్‌లలోకి నేరుగా జమ చేస్తున్నట్టు వివరించారు. 


వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తోందని వివరించారు శోభ. గతంలో ఎద్దులు, ఇతర వ్యవసాయ పనిముట్ల వ్యవసాయం చేసుకునే వారిని, చిన్న సన్నకారు రైతులకు సహకారం అందించాలని ఉద్దేశంతో యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. స్తోమత లేని రైతులు వ్యవసాయ యంత్రాలను బాడుగకు తీసుకొని వారి పనులకు ఉపయోగించుకోవాలన్నారు. పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీతో యంత్రాలను అందిస్తున్నామన్నారు. రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు, టిల్లర్‌లు, ఇతర పనిముట్లు, తదితర యంత్రాల ధరలు స్పష్టంగా రైతులకు తెలిసేలా స్పష్టమైన సమాచారం అందించాలని ఇటీవలే రాష్ట్రాలకు సూచించినట్టు వెల్లడించారు. 


రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు శోభ. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద గోదాములు, శీతల గోదాములు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు, గ్రీన్ హౌస్, పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రైతుల ఉత్పత్తులను రైతులే మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అధిక లాభం పొందవచ్చన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 2023 వ సంవత్సరంలో రాగి, జొన్న పంట ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మలేషియా, ఇండోనేషియా నుంచి 80 శాతం మేర వంటనూనెలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. రైతులు ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ పండించేందుకు ముందుకు రావాలని, అలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.


రైతులు మాట్లాడుతూ వ్యవసాయ పనులకు రాకుండా ఎక్కువ మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద కల్పిస్తున్న పనులకు వెళ్తున్నారని... దీంతో వ్యవసాయ పనులకు ఎక్కువ ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. వ్యవసాయ పనులకు కూడా ఉపాధి హామీని అనుసంధానం చేయాలని రైతులు కోరారు. తామంతా కలిసి ఎఫ్‌పిఓలను కూడా ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. స్థానిక అధికారులు చివరి రైతు వరకు కూడా పథకాల లబ్ధి చేకూరేలా సహకారం అందించాలన్నారు.