రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రబీ పంట సీజన్లో (2023 అక్టోబర్ 1 - 2024 మార్చి 31) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి వివిధ పోషకాల కోసం ఎరువుల సబ్సిడీ రేట్లను (NBS) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం రూ.22,303 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ.. రైతులు మాత్రం డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఎరువును బస్తాకు పాత ధర రూ.1,350 మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు.


తాజా నిర్ణయంతో కిలో నత్రజనిపై రూ.47.2, కిలో ఫాస్ఫరస్పై రు. 20.82, కిలో పొటాష్పై రూ.2.38, కిలో సల్ఫర్పై రూ.1.89 సబ్సిడీ లభించనుంది. ఇక టన్ను డీఏపీకి రూ.4500 సబ్సిడీ ఇవ్వనుంది కేంద్రం. ఎన్‌పీకే ఎరువు బస్తా రాయితీ ధర రూ.1470 లభించనుంది.


రైతులకు సులభంగా, అందుబాటు ధరలో ఎరువులు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ, ఎంఓపీ (మ్యూరియెట్ ఆఫ్ పొటాష్), సల్ఫర్ వంచి ఎరువుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. రైతులకు తక్కువ ధరలో ఎరువులు లభ్యమయ్యేలా.. ఆమోదించిన రేట్ల సబ్సిడీని ఎరువుల తయారీ కంపెనీలకు చెల్లిస్తామని వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎరువుల రేట్లు పెరిగినా కూడా రైతులపై భారం పడనివ్వకుండా ఎరువులపై సబ్సిడీ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.


ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు


2024-2025 రబీ మార్కెటింగ్‌ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచడానికి కేంద్ర మంత్రిమండలి ఇటీవల (అక్టోబర్ 18) పచ్చజెండా ఊపింది. క్వింటా గోధుమకు రూ.150 పెంపును ఖరారు చేశారు. బార్లీపై రూ.115, పై రూ.105 పెంచారు. పొద్దుతిరుగుడుకు రూ.150, ఆవాలకు రూ.200 పెంపు నిర్ణయించారు. కంది పప్పు క్వింటాకు రూ.425 పెంచారు. ఈ నిర్ణయంతో క్వింటా గోధుమల ధర రూ.2275 చేరగా.. బార్లీ రూ.1850, శనగలు రూ.5440, పొద్దుతిరుగుడు రూ.5800, ఆవాలు రూ.5650, కంది పప్పు రూ.6425 పెరిగింది.


ఈ సీజన్‌లో ఎరువుల సరఫరా కోసం డిమాండ్ కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని అన్నారు. రైతులకు లభ్యతకు సంబంధించి తగిన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని మరియు ఎరువుల నిల్వలకు సంబంధించిన భయాందోళనలు లేదా తప్పుడు సమాచారాన్ని సృష్టించవద్దని ఆయన రాష్ట్రాలకు సూచించారు.


ఎరువుల మళ్లింపు వంటి దుర్వినియోగాల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కేంద్ర మంత్రి, అటువంటి పరిస్థితుల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎరువుల మార్కెట్‌లో ఇటీవలి పోకడలపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ ఎరువులు , నానో యూరియా వినియోగం, సేంద్రియ వ్యవసాయం వంటి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.


ఎరువులను నేల స్థాయిలో సమతుల్య స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలి. ప్రతి జిల్లా స్థాయిలో ఎంత ఎరువులు అందుబాటులో ఉన్నాయో, ఎంత అవసరమో రాష్ట్రాలు గమనించాలని, దుర్వినియోగం లేదా ఏదైనా తేడాలు లేదా బ్లాక్‌మార్కెటింగ్‌ను నివారించడానికి ప్రతి రైతు ఎంత ఎరువులు కొనుగోలు చేశారనే దానిపై నిఘా ఉంచాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కోరారు.