తెలంగాణలో పత్తి కొనుగోలుకు అధికారులు సిద్ధమయ్యారు. నవంబర్‌ మొదటి వారంలో కొనుగోళ్లు జరిపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే ధర విషయంలో మాత్రం రైతులు అసంతృప్తితో ఉన్నారు. 


కాటన్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోళ్లకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 350పైగా కేంద్రాలను రెడీ చేసింది. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సరకుతో వచ్చిన రైతులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. 


అన్ని ఏర్పాట్లు సవ్యంగా సాగుతున్నప్పటికీ ధర విషయంలో మాత్రం రైతులు అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం క్వంటా ధర 7వేల రూపాయలుగా ఉంది. ఈ రేటు రావాలంటే 8 శాతం మాత్రమే తే ఉండాలని అధికారులు చెబుతున్నారు. అయితే అంతకు మించి తేమ ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు భారీగా ధర చెల్లిస్తున్నారు. 15 శాతానికి పైగా తేమ ఉన్న సరకుకే ప్రైవేటు వ్యాపారులు దాదాపు ఏడు వేల వరకు ఇస్తున్నారు. ఈ లెక్క ప్రకారమైతే 8 శాతం ఉన్న పత్తికి ఏడు వేల ఐదు వందల వరకు ఇవ్వాలనే డిమాండ్ ఉండనే ఉంది. 


ఇప్పుడిప్పుడే రాష్ట్రవ్యాప్తంగా పత్తి కోత మొదలైంది. రాబోయే వారం పదిరోజుల్లో మరింత ఊపందుకోనుంది. దీంతో మార్కెట్‌లో ధర పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిని ముందుగానే అంచనా వేస్తున్న అధికారులు ఆ దిశగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ బహిరంగ మార్కెట్‌లో ధర పడిపోయినా తాము రైతులు నష్టపోకుండా ధర చెల్లిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయింది. అంటే దాదాపు 40 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.