అంద‌రిలా కాకుండా వినుత్నంగా ఆలోచించి ఆడ‌వి ప్రాంతంలో పండే ఆడ‌వి బోడ కాక‌ర కాయ పంట‌ను సాగుచేసి లాభాల పంట పండిస్తున్నాడో రైతు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఈ పంట‌ను ఆర్గానిక్ ప‌ద్దతిలో పండించి అధిక లాభాలు పొందుతున్నాడు. 50 రోజుల్లో పంట చేతికి రావ‌డంతో మూడు నెల‌లపాటు వారానికి రెండు క్వింటాళ్ల దిగుబ‌డి సాధిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన‌ జంగం భూమ‌న్న అనే రైతు.
   
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో రైతు జంగం భూమన్న. అరుదుగా లభించే బోడ కాకర సాగు చేస్తూ మంచి గిట్టు బాటు ధర పొందుతున్నారు. సాధరణంగా ఆడవుల్లో ఈ బోడ కాకర లభిస్తుంది. దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు. డయాబెటిసీ ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రచారం. అరుదుగా లభించే బోడ కాకరకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 


అందుకే  రైతు భూమన్న అర ఎకరంలో పంట సాగుకు రూ. 1.5 లక్షలు వెచ్చించారు. పూర్తిగా ఆర్గానిక్ ప‌ద్దతిలో పంట సాగు చేశారు. పంట 50 రోజులకు కోతకు వస్తుంది. కోత మొద‌లైన నాటి నుంచి మూడు నెల‌ల‌ వరకు ప్రతి వారం క్వింటాల్‌ నుంచి రెండు క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబడి వస్తుంది. మూణ్నెళ్లలో మొత్తం 15 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుంది. ఇప్పటి వరకు రెండున్నర నెలల్లో 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మ‌రో నెల రోజులు దిగుబ‌డి అధికంగా ఉంటుంది. 


మార్కెట్‌లో ధ‌ర కూడా బాగుంది. ఆడ‌వి బోడ కాక‌ర కాయ కిలో రూ.200 ప‌లుకుతుంది. హోల్ సెల్‌గా రూ.150 నుంచి రూ.180 ప‌లుకుతుంది. దీంతో క్నింటాల్‌కు రూ.15వేల నుంచి రూ.18వేల రూపాయ‌లు వ‌స్తున్నాయి. అర ఎకరానికి 1.5 లక్షల పెట్టుబడి అయితే రూ. 3 లక్షల ఆదాయం వస్తుందిని రైతు చెబుతున్నారు.


బోడ కాకరకాయ సాగును బెడ్ సిస్టమ్‌లో మాల్చిన్ పేపర్ వేసి... నాలుగు టిప్పర్ల‌ చెరువు మట్టి.. రెండు లారీల ఆవుపేడ వేసి ఏలాంటి ఫర్టీలైజ‌ర్ వేయ‌కుండా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాడీ రైతు. సాగు చేయాడం కష్టమే.. కానీ మార్కెట్ చూసుకొని పెడితే బ్రహ్మాండమైన లాభాలు సాధించవచ్చు అంటున్నాడు భూమన్న. ప్రభుత్వం బోడ కాకర విత్తనాలు స‌బ్సిడీలో ఇస్తే సాగు విస్తీర్ణం మరింత పెంచవచ్చు అంటున్నారు. 


బోడ కాక‌ర కాయ సీడ్ సైతం రైతు భూమన్న పండిస్తున్నాడు. ఈ సీడ్ అవసరం ఉన్న వాళ్లు తమను సంప్రదించవచ్చని చెబుతున్నాడు రైతు భూమన్న. సంప్రదాయ పంటల కంటే పంట మార్పిడి చేస్తూ సాగుచేయడం వలన లాభాలు సాధించవచ్చని ఈ రైతు నిరూపించాడు. ఓ వైపు ప్రభుత్వాలు వరి సాగును మాని ప్రత్యామ్నయ పంటలు వేసుకోవాలని ప్రతి ఏటా సూచిస్తోంది. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధారిత జిల్లా కావటం ఇక్కడ ఎక్కువగా వరి పంట పండిస్తారు. ఇలా కామన్ గా కాకుండా భూమన్నలా ప్రత్యామ్నయ పంటలవైపు మొగ్గు చూపితే రైతుకు లాభాల పంట పండటం ఖాయం అంటున్నారు. 


ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్, కశ్మీర్ బేర్, సిరి ధాన్యాలు, బ్లాక్ రైస్ ఇలా విభిన్న పంటలు పండిస్తూ... రైతులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. రైతు భూమన్న కేవలం అర ఎకరంలో బోడ కాకరను సాగు చేశారు. తొలి ప్రయత్నంలోనే భూమన్నకు మంచి లాభాలు వచ్చాయ్. బోడ కాకరలో అనేక పోషక గుణాలుంటాయ్. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. 


ఈ బోడ కాకర ఎక్కువ అడవుల్లో నెచురల్‌గా లభిస్తుంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో అడవుల్లో బోడ కాకర కాస్తుంది. భూమన్న అడవుల్లో లభించే బోడ కాకరను సేకరించి మొదట వీటిని విత్తనాలు సేకరించారు. ఆ తర్వాత తొలి ప్రయత్నంగా అర ఎకరంలో పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో సాగు చేశారు. ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా బ్రహ్మాండంగా పంట దిగుబడి వచ్చింది. ఎందుకంటే ఇది ప్రకృతి సహజంగా వచ్చే కాయ. దీంతో ఫర్టిలైజర్స్ లేకుండా దిగుబడి భారీగా ఉంటుంది. కూరగాయలన్నింటిలో ఇదే అత్యధిక ధర ఉంటుంది. అందుకే భిన్నంగా ఆలోచన చేసిన రైతు భూమన్న మార్కెట్ లో బోడ కాకరకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పంటను సాగు చేస్తూ... సిరులు కురిపిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.