Tomato Rates Drop : కొన్ని నెలల క్రితం వంద రూపాయలకు పైగా పలికిన టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. కిలోకు రూ.5 కూడా రావడంలేదని రైతన్నలు వాపోతున్నారు. గత మూడు వారాలుగా టమాటా ధర భారీగా తగ్గిపోయింది. పంట దిగుబడికి వచ్చి మార్కెట్లకు చేరడమే ఇందుకు కారణం అంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. టమాటా ధర కనిష్టానికి చేరుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రానిపరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. 


మదనపల్లె మార్కెట్ ధరలు పతనం 


ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలోని మార్కెట్ లో కిలో టమోటా కనిష్టానికి చేరుకుంది. కిలో రూ. 5లు పలుకుతుండడంతో కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. కూలీల ఖర్చు కూడా రావడంలేదని కొందరు రైతులు కోతకు వచ్చిన టమాటాలు పొలాల్లోనే వదిలేస్తున్నారు. మదనపల్లె మార్కెట్‌ నుంచి టమాటాలు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి.  తాజాగా మదనపల్లి మార్కెట్ కు  989 మెట్రిక్ టన్నుల టమోటాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల ట్రేడర్లు టమాటాల కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయి.  దీంతో టమాటాకు భారీగా డిమాండ్ తగ్గింది. ఇతర రాష్ట్రాల్లో కూడా టమాటా పంట దిగుబడికి రావడం కారణంగా చెబుతున్నారు. 


ఒకేసారి దిగుబడి 


అన్నమయ్య జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లో టమాటా పంటను అధికంగా సాగుచేస్తారు. ఇక్కడి నుంచి దేశంలోని చాలా రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతుంటాయి. జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో టమాటా పంట సాగు చేస్తున్నారు.  పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాటా పంట సాగవుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో 41,002 ఎకరాల్లో ఏడాది పొడవునా టమాటా సాగు చేస్తుంటున్నారు. దీంతో టమాటా దిగుబడి భారీగా పెరిగి ధరలపై ప్రభావం పడుతోంది. కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి, కోలారు, ముళబాగిలు, బాగేపల్లె నియోజకవర్గాల్లో కూడా టమాటా సాగు భారీగా సాగుతోంది. ఒక్కసారిగా దిగుబడులు రావడంతో జిల్లాలో టమాటా ధరలపై ప్రభావం పడింది. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, కలికిరి టమాటా మార్కెట్లలో ధరలు పతనం అయ్యాయి. మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా మొదటి రకం రూ.8.40–10 పలకగా, రెండో రకం రూ.5.00–8.20 మధ్యన పలికింది. 


ఏడు రాష్ట్రాలకు ఎగుమతి 


మదనపల్లె మార్కెట్‌ నుంచి సుమారు ఏడు రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతుంటాయి. ఈ మార్కెట్ నుంచి 60 శాతం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, వరంగల్, మహరాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్,మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్‌పూర్,  పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు దిల్లీకి టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. 


Also Read : AP Bar Licenses : ఏపీలో రెండో రోజు బార్ లైసెన్సులకు ఈ-వేలం, తొలి రోజు భారీ స్పందన!


Also Read : Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధర, వెండి మాత్రం భారీ పెరుగుదల - నేటి ధరలు ఇవీ