AP Bar Licenses : ఆంధ్రప్రదేశ్ లో మద్యం బార్ల లైసెన్సుల కోసం బిడ్డింగ్ కొనసాగుతోంది. రెండో రోజు ఆదివారం బార్ల ఈ-వేలం నిర్వహిస్తున్నారు. ఇవాళ కోస్తాలోని ఆరు జిల్లాల్లో 500 బార్లకు బిడ్డింగ్ జరుగుతోంది. ఏపీలో తొలి రోజు శనివారం బార్ల ఈ వేలానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 323 బార్లకు ఈ వేలం చేపట్టారు. తొలిరోజు ఈ వేలంలో మొత్తం రూ.258 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో బార్ల వేలంలో ఎక్కువగా అధికార పార్టీ నేతలు కైవసం చేసుకున్నట్లు సమాచారం. కడపలో అత్యధికంగా ఓ బార్‌కు రూ.1.89 కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్నారు.


జోన్-2,3 లకు బిడ్డింగ్ 


ఏపీలో బార్‌ లైసెన్సుల ఈ వేలం జరుగుతోంది. జోన్‌-1, జోన్- 4 కు బిడ్డింగ్ శనివారం పూర్తవగా ఇవాళ జోన్‌-2, జోన్-3లకు బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు. బార్ల లైసెన్సుల కోసం అధికారులు ఈ వేలం నిర్వహిస్తు్న్నారు. జోన్‌-1, జోన్‌-4లో నిర్వహించిన బిడ్డింగ్ లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. ఇవాళ జోన్‌-2, జోన్‌-3కి నిర్వహించే బిడ్డింగ్ లో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదారి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ ఒకటి నుంచి కొత్త లైసెన్స్ పాలసీ అమలవుతుంది. కొత్త బార్‌ పాలసీ ప్రకారం 2025 వరకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేస్తుంది. 


భారీగా రిజిస్ట్రేషన్ ఫీజులు 


బార్ల ఈ వేలంలో పలు జిల్లాల్లో భారీ స్పందన రాగా మరికొన్ని జిల్లాల్లో ఆశించినంత స్పందన లేదు. కర్నూలు జిల్లాలో 27 బార్లకు బిడ్డింగ్ నిర్వహించగా కేవలం 36 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. అయితే కొందరు నేతలు బెదిరింపుల వల్ల బిడ్డింగ్ కు వ్యాపారులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా భారీగా ఉండడంతో ఆసక్తి చూపడంలేదని మరికొందరు అంటున్నారు.  కర్నూలులోని 18బార్లకు 23మంది, ఆదోనిలో 5 బార్లకు ఆరుగురు, ఎమ్మిగనూరులో 3 బార్లకు ఐదుగురు, గూడూరులో ఒక బార్‌కు ఇద్దరు ఈ వేలంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 1,672 మంది అప్లై చేసుకుంటే, 1,158 మంది మాత్రమే ఫీజు చెల్లించినట్లు సమాచారం. మరో 514 మంది పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.  


నూతన బార్ లైసెన్స్ లు 


ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన బార్ లైసెన్స్ విధానానికి భారీ స్పందన వస్తుంది. ఈ వేలంలో బార్లు దక్కితే 2025 వరకూ లైసెన్స్ అమల్లో ఉంటుంది. మద్యం అమ్మకాలు పెరుగుతున్న క్రమంలో బార్లపై పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఫీజుల రూపంలోనే ఖజానాకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. విశాఖలో మద్యం బార్ల పోటీ మరింత ఎక్కువగా ఉంది. బార్ లైసెన్స్ దక్కించుకునేందుకు భారీ స్పందన వచ్చింది. 2017-22 బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు రూ.44 లక్షలు ఉంది. బిడ్డింగ్ కూడా ఎక్సైజ్ అధికారుల ప్రమేయంతో జరిగేది. అయితే బార్ పాలసీలో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఎక్కడి నుంచైనా బిడ్డింగ్ వేయవచ్చు. లైసెన్స్ ఫీజులను పెంచడమే కాకుండా నాన్ రిఫండబుల్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. పెద్ద నగరాల్లో రూ.60 లక్షలు, జనాభా 5 లక్షలు దాటిన మున్సిపాలిటీల్లో రూ.35 లక్షలు, మిగిలిన టౌన్లలో రూ.15 లక్షలుగా ఫీజులు నిర్ణయించింది ప్రభుత్వం.