WPLలో దిల్లీ క్యాపిటల్స్‌ బోణీ కొట్టింది. స్టార్లతో నిండిన రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తుచిత్తుగా ఓడించింది.

224 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని గజగజా వణికించింది. కేవలం 163/8 స్కోరుకే పరిమితం చేసింది.

60 తేడాతో విజయ దుందుభి మోగించింది. పదునైన బౌలింగ్‌తో టారా నోరిస్‌ (5/29) ప్రత్యర్థి పతనాన్ని శాసించింది.

ఆర్సీబీలో స్మృతి మంధాన (35; 23 బంతుల్లో 5x4, 1x6), హీథర్‌ నైట్‌ (34; 21 బంతుల్లో 2x4, 2x6), ఎలిస్‌ పెర్రీ (31; 19 బంతుల్లో 5x4) టాప్‌ స్కోరర్లు.

అంతకు ముందు డీసీలో షెఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10x4, 4x6), మెగ్‌ లానింగ్‌ (72; 43 బంతుల్లో 14x4) నాటు కొట్టుడు కొట్టారు.

మారిజాన్‌ కాప్‌ (39*; 17 బంతుల్లో 3x4, 3x6), జెమీమా (22*; 15 బంతుల్లో 3x4, 0x6) మెరుపులు మెరిపించారు.

కొండంత లక్ష్య ఛేదనకు దిగిన RCBకి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్‌ (14) తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం అందించారు.

అమెరికా పేసర్ టారా నోరిస్ బౌలింగ్‌కు రావడంతో బెంగళూరు పతనం మొదలైంది. ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది.

మొదట దిల్లీ ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్‌ లానింగ్‌ నువ్వా నేనా అన్నట్టు పోటీపడి మరీ చితక బాదేశారు.



షెఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగితే లానింగ్‌ బంతుల్ని నేలకు ముద్దాడేలా బౌండరీలకు పంపించింది. ఒకానొక దశలో షెఫాలీ సెంచరీ చేసేలా కనిపించింది.