కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేయాలంటే!



కృష్ణాష్టమి రోజు లోగిళ్లలో చిన్ని కృష్ణుడి అడుగులు భలే ముద్దుగా కనిపిస్తాయి. ఇంట్లోంచి బయటకు కాకుండా.. ఇంటి బయటి నుంచి లోపలకు వేస్తారు అడుగులు. ఆ అడుగులు వేయడం వెనకున్న ఆంతర్యం ఏంటో తెలుసా..!



సాధారణంగా శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి. కానీ రామ, కృష్ణావతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు. పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడిని అని చెప్పలేదు...కానీ కృష్ణావతారంలో తానే దేవుడిని అని స్పష్టంగా చెప్పాడు కృష్ణపరమాత్మ.



ఎక్కువ మంది కృష్ణుడిని భగవత్ స్వరూపంగా కన్నా గురువుగా భావిస్తారు. గురువు అంటే చీకటి లోంచి వెలుగులోకి, అజ్ఞానం లోంచి జ్ఞానంవైపు నడిపించే మార్గదర్శి. అందుకే తమలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని కన్నయ్యను అడుగులు వేసి లోపలకు ఆహ్వానిస్తారు.



బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం...ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లోనూ గురుతత్వాన్ని చూపించిన అవతారం కూడా కృష్ణడొక్కటే. అందుకే కృష్ణడికి ఇంట్లోకి ఆహ్వానం పలకడం ద్వారా సకలదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.



దేవుడిగా కన్నా..గురువుగా, స్నేహితుడిగా నా ఇంట్లోకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ కృష్ణుడి అడుగులు వేస్తారు.



కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి వెన్నంటే ఉండి దోషాల నుంచి విముక్తి కల్పించి విజయాన్ని అందించినట్టే..తాము తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడామని కన్నయ్యను వేడుకుంటారు.



కృష్ణుడు వెన్నంటే ఉండి నడిపించాడు కానీ ఎక్కడా నేరుగా రంగంలోకి దిగలేదు. ధర్మం దిశగా మార్గనిర్దేశకత్వం చేశాడు, వేలుపట్టి నడిపించాడు. అలా నిర్వర్తించాల్సిన ధర్మం దిశగా నడిపించని.. వెళుతున్న మార్గంలో అవరోధాలు తొలగించమని కృష్ణపాదుకలు వేస్తారు.



మనిషిగా పుట్టినందుకు మనిషిగా ప్రవర్తించే నడవడినను నేర్పించమని చెప్పడానికే కృష్ణుడి అడుగులు వేస్తారు



కృష్ణుడిని భగవంతుడిగా పూజించేవారి కన్నా..స్నేహితుడిగా, గురువుగా భావించిన వారినే ఎక్కువగా అనుగ్రహించాడు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అన్నీ అర్థం కావాలంటే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు.



ఒక్కమాటలో చెప్పాలంటే బతికేస్తున్నాం అనుకోవడం వేరు బతకడం వేరు...బతుకు నేర్పమని అడుగుతూనే కృష్ణుడి అడుగు వేస్తారు.