కృష్ణుడిని భగవంతుడిగా పూజించేవారి కన్నాస్నేహితుడిగా, గురువుగా భావించిన వారినే ఎక్కువగా అనుగ్రహించాడు. ఎక్కడ తగ్గాలి,ఎక్కడ నెగ్గాలి,ఎలా ప్రవర్తించాలి అన్నీ అర్థం కావాలంటే కృష్ణతత్వం అర్థం కావాలి..
గురుతత్వాన్ని చూపించిన అవతారం:ప్రతి ఒక్కరి జాతకాల్లో దోషాలుంటాయి. కొన్ని దోషాలు పూజల ద్వారా పరిష్కార మవుతాయి. కానీ అస్సలు రెమిడీస్ లేని దోషాలు కొన్ని ఉంటాయి. అలాంటి దోషాలు పూజల వల్ల కూడా పరిహారం కావు. కేవలం గురువు ఆశీర్వచనం ఉంటే పరిష్కారం అవుతాయి.
అందుకే వేదం చదువుకున్న పండితుడితో 'శతాయుష్మాన్ భవం..శత మనంతంభవతి' అనే ఆశీర్వచనం పొందాలని భావిస్తారు. తద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
సులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం: రాముడిని రామాయణం అంటాం. అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం. కేవలం కృష్ణుడిని మాత్రమే కృష్ణతత్వం అంటారు.
రాముడిని త్రేతాయుగంలో కొందరు పూజించారు...కలియుగంలోనూ పూజలందిస్తున్నాం. కానీ కృష్ణుడిని కొందరు రుషులు పండితులు కూడా తెలుసుకోవాలని తాపత్రయపడ్డారు. వ్యాసభగవానుడు అంతటి వాడే కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం కష్టం అని తేల్చేశాడు.
స్నేహధర్మానికి నిదర్శనం కృష్ణతత్వం: వాస్తవానికి కురుక్షేత్రం సంగ్రామం పూర్తికాకముందే అర్జునుడు ఆయుర్దోషం పొందుతాడని(చనిపోతాడని) రుషులు ముందే చెబుతారు. కానీ యుద్ధం చివరి వరకూ అర్జునుడు ఉన్నాడు. మొత్తం యుద్ధం ముగిసిపోయింది..అందర్నీ చంపేశా అని అర్జునుడు అనగానే...
కృష్ణుడు అర్జునిడితో రథం కిందకు దిగు అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు కూడా కిందకు దిగి రథం చుట్టూ ప్రదిక్షిణ చేస్తాడు. వెంటనే ఆ రథం పెళపెళమని విరిగి బూడిదైపోతుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు...
భీష్ముడు, ద్రోణులు, కర్ణుడు లాంటి వారు వేసిన బాణాలతో ఎప్పుడో రథం కాలిపోయింది. కానీ గురువుగా, స్నేహితుడిగా నీవెంట ఉన్నా కాబట్టే కాలిన రథం కాలినట్టు నీకు కనిపించలేదంటాడు.అదే కృష్ణతత్వం.
కృష్ణుడు ఉంటే ఆనందమే: లౌకికంగా చూస్తే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అందుకే కృష్ణుడు ఉన్న ప్రదేశాన్ని బృందావనం అంటారు. బృంద అంటే తులసి... బృంద అంటే ఆరోగ్యంతో కూడిన ఆనందం. ఆ ఆనందం వనంలా పెరిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది.