నదిలో నాణేలు ఎందుకు వేస్తారు!



హిందూ సంప్రదాయంలో ఎన్నో పద్ధతులు పాటిస్తారు…ఎన్నో నియమాలు అనుసరిస్తారు. అందులో ప్రతి నియమం వెనుక, ప్రతి పద్ధతి వెనుక శాస్త్రీయ కోణం ఉంటుంది.



పుష్కరాల సమయంలో అయినా, గ్రహణ స్నానాల సమయం, ప్రయాణం చేసేటప్పడు మార్గ మధ్యలో నది కనిపించినా… ఇలా రకరకాల సందర్భాల్లో ఆయా నదుల్లో నాణేలు వేసి నమస్కారం చేస్తుంటాం.



అయితే నదుల్లో వేయాల్సింది ఇప్పుడు చలామణిలో ఉన్న నాణేలు కాదు రాగి నాణేలు వేయాలి. ఇప్పుడున్న రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు ఇనుముతో తయారుచేసినవి.



అప్పట్లో నాణేలన్నీ కేవలం రాగితోనే తయారు చేసేవారు. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుంది. అందుకే అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసే వారు.



రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అందుకే రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని అలా చేసేవారు.



అప్పట్లో అంతా నదుల్లో నీటిని నేరుగా తాగేవారు. ఇప్పటిలా ఫిల్టర్లు లేవు. అందుకే రాణి నాణేలు వేసి నీటిని శుభ్రపరిచేవారు. ఇప్పుడున్న నాణేలు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సరికదా మరింత నష్టమే జరుగుతుంది.



ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఆ చిల్లర పైసలు ఏరుకునేందుకు నదుల్లో దూకి కొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు



ప్రస్తుతం చలామణిలో ఉన్న ఇనుప నాణేలు నీటిలో వేయొద్దు. రాగి నాణేలు దొరికితే మాత్రం నిరభ్యంతరంగా వేయండి. ఇక అమితమైన భక్తితో కొబ్బరి కాయలు కొట్టి కూడా నదిలోకి విసిరేస్తుంటారు కొందరు. ఇలా చేయడం వల్ల కూడా నదిలో నీళ్లు పాడవుతాయి.



మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాల వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. కానీ వాళ్లని అనసరించామన్న పేరుతో మరింత అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించండి.



నాటి సంప్రదాయాలను అనుసరించడం మంచిదే అయినా ఎలా చేయాలి…ఎందుకు చేయాలి.. వాటివెనుకున్న ఆంతర్యం ఏంటన్నది తెలుసుకుని చేయండి.