చాణక్య నీతి: పగ తీర్చుకోవడం అంటే ఎలా ఉండాలో తెలుసా!



మగధ దేశాన్ని ధననందుడు పాలించే రోజులవి. అహంభావి, క్రూరుడు అయిన ధననందుడు తన మంత్రి కాత్యాయనుడిని, కుమారులను బంధించి వేధించాడు. హింస భరించలేక కాత్యాయనుడి పిల్లలంతా చనిపోయారు.



కొన్నాళ్ల తర్వాత కాత్యాయనుడి తప్పు లేదని తెలుసుకుని విడిచిపెట్టి మంత్రిగా కొనసాగించాడు ధననందుడు. కానీ తన పిల్లల్ని చంపిన రాజుపై పగ అలాగే ఉండిపోయింది. పైకి మామాూలుగా ఉన్నా పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూశాడు.



అలాంటి సమయంలో కనిపించాడు చాణక్యుడు. రాజ్యంలో అంతమంది ఉన్నా కాత్యాయనుడి చూపు చాణక్యుడిపై ఎందుకు పడిందో తెలుసుకోవాలంటే చాణక్యుడి తండ్రి చనకుడి మరణం గురించి చెప్పుకోవాలి.



తండ్రి మృతదేహం దగ్గర కూర్చుని ఏడుస్తున్న చాణక్యుడికి ఓ వార్త తెలిసింది. ఇంటి చుట్టూ సూదుల్లా ఉన్న గడ్డిపై నడిచిన సమయంలో తండ్రి కాలికి గాయం అయిందని.. ఆ గాయం పెద్దదై చనిపోయాడని తెలిసింది.



తండ్రి అంత్యక్రియలు పూర్తైన మర్నాటి నుంచి చాణక్యుడు ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిని పెకిలించడం మొదలు పెట్టాడు. గడ్డిని పెరికి మొదట్లో పంచదార నీళ్లు పొయ్యడం ప్రారంభించాడు.



ఇది గమనించిన మంత్రి కాత్యాయనుడు దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. సూదుల్లాంటి ఈ గడ్డిపై పాదం మోపడం వల్ల తన తండ్రి చనిపోయాడని అందుకే గడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటున్నా అన్నాడు.



గడ్డి మళ్లీ మొలవకుండా ఉంటుందా అంటే...అందుకే పంచదార నీళ్లు పోస్తున్నా అని బదులిచ్చాడు చాణక్యుడు. పంచదార నీళ్ల వల్ల చీమలు చేరి మొదలు వరకూ కొరికేస్తాయని క్లారిటీ ఇచ్చాడు.



చాణక్యుడిలో కసి, పట్టుదల చూసిన కాత్యాయనుడు ఇలాంటి వ్యక్తికోసమే కదా వెతుకుతున్నా అని మనసులో అనుకున్నాడు.



ఆ క్షణం చాణక్యుడిని ధన నందుడిపై ప్రయోగించాలన్న కాత్యాయనుడి నిర్ణయం... గడ్డిని పూర్తిగా పెకిలించి మొలవకుండా చేసినట్టే నంద వంశం సమూలంగా నాశనమయ్యేందుకు దారి తీసింది.



ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఆ క్షణం గెలిచి వదిలేయడం కాదు.. మళ్లీ తిరుగుబాటు చేయాలనే ఆలోచనను చంపేయడం, ఆ అవకాశం లేకుండా చేయడమే అన్నది చాణక్యుడి ఉద్దేశం.