తిథులు ముందురోజు, తర్వాతి రోజు వచ్చినప్పుడు పండుగ ఏ రోజు జరుపుకోవాలనే డైలమా ఉంటుంది. నిన్నటి వరకూ రాఖీ పౌర్ణమి విషయంలో ఇదే జరిగింది...ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే సందిగ్ధం నెలకొంది.
ఆగస్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది..తదుపరి అష్టమి వచ్చింది
ఆగస్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది
పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 19 శుక్రవారం జరుపుకోవాలన్నది క్లారిటీ ఉంది.
ఆగస్టు 18న జరుపుకోవాలన్న వాదన ఎందుకు తెరపైకి వచ్చిందంటే... శ్రీకృష్ణుడు అష్టమి తిథి అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని, అందుకే ఆగస్టు 18న ఆ సమయానికి అష్టమి రావడంతో అదేరోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలంటున్నారు.
సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగస్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు
కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు.
కృష్ణాష్టమి రోజున ఒకపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.