ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు.
వానాకాలం మొదలయ్యే సమయం కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.
తొలిఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉంది జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తి ని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం.
తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఈ యోగ నిద్ర ద్వారా...భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా చెబుతారు.
ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి దేవునికి నివేదన చేయాలి.
తొలిఏకాదశి ఉపవాసం, పూజ వల్ల సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు.
ఈ నాలుగు నెలల కాలాన్నీ అత్యంత పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష చేస్తారు. ఈ దీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.
కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి.
ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది.
బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి ఈ పిండి వేడి కలిగించి, వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.