ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ఈఎంఐపై రుసుము

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు దారులు ఇకపై ఈఎంఐ లావాదేవీలపై రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 1 నుంచి ఈఐంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ రుసుము వసూలు చేయడమే ఇందుకు కారణం.



వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌, ఈ-కామర్స్‌, నేరుగా దుకాణాల్లో కొనుగోలు చేసి వాటిని ఈఎంఐగా మార్చుకుంటే రూ.99+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సేవింగ్స్‌పై వడ్డీరేటు తగ్గింపు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీరేట్లను మరింత తగ్గించింది. దాదాపు పది బేసిస్‌ పాయింట్ల మేరకు కోత విధించింది.



రూ.10లక్షల కన్నా తక్కువ మొత్తం ఉండే ఖాతాలపై 10 పాయింట్లు, రూ.10 లక్షల కన్నా ఎక్కువ మొత్తం ఉండే ఖాతాలపై 5 పాయింట్ల మేర కోత పడనుంది. అంటే వార్షికంగా 2.80 నుంచి 2.85 శాతం మేర ప్రభావం ఉంటుంది.

లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు ముగిసింది

పింఛన్‌దారులు జీవన ప్రమాణ పత్రం దాఖలు చేసే చివరి తేదీ నవంబర్‌ 30న ముగిసింది. అయితే ఈపీఎఫ్‌వో నుంచి పింఛను పొందే ప్రైవేటు ఉద్యోగులు ధ్రువపత్రం సమర్పించేందుకు గడువు వేరే ఉంటుంది.



ఆ గడువు లోపు వీరు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే లబ్ధిదారులకు ప్రయోజనాలు నిలిచిపోతాయి.

పీఎఫ్‌- ఆధార్‌ అనుసంధానం

ఆధార్‌-ఈపీఎఫ్‌వో అనుసంధానం చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్‌ 30తో ముగిసింది. ఒకవేళ మీరు ఆ తేదీలోపు యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌తో ఆధార సంఖ్య లింక్‌ అవ్వకపోతే సంబంధిత ప్రయోజనాలు ఈ నెలతో నిలిచిపోతాయి.



ఇకపై యజమాని నుంచి వచ్చే కంట్రిబ్యూషన్‌ ఆగిపోతుంది. పీఎఫ్‌లోని నిధులును ఉపసంహరించేందుకు వీలుండదు.

ఆదాయపన్ను దాఖలు

ఆదాయపన్ను దాఖలు (ITR) చేసేందుకు 2021, డిసెంబర్‌ 31 చివరి తేదీ. గడువులోపు పన్ను వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్‌కం టాక్స్‌ కొత్త వెబ్‌సైట్‌లో ఇబ్బందులు ఉండటంతో గడువును ఈ నెలాఖరుకు పెంచారు.



ఇలా గడువు పెంచడం ఇది రెండోసారి. కొవిడ్‌ రెండో వేవ్‌ వల్ల జులై 31న ముగిసిన గడువును సెప్టెంబర్‌ 30కి పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచారు.