మొక్కజొన్న పీచుతో టీ, బరువు తగ్గుతారు వానాకాలంలో వేడి వేడిగా ఉడికించిన మొక్కజొన్నలు తింటే ఆ రుచే వేరు. ఎంతోమందికి మొక్కజొన్న అంటే ఇష్టమే. మొక్కొజొన్న తొక్కలు తీశాక లోపల లేత పీచు ఉంటుంది. ఆ పీచును దాచుకొని టీ చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. ఆ పీచులో విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఆ పీచును ఒకసారి కడిగేసుకొని టీ కాచుకుంటే ఎంతో మంచిది. రెండు గ్లాసుల నీటిలో ఆ పీచును వేసి బాగా మరిగించాలి. వడకట్టి ఆ నీటిని తాగేయాలి. ఇదే పీచుతో చేసే టీ. మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీని తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. ఇవి మూత్రనాళంలో మంటను తగ్గిస్తాయి. దీనివల్ల మూత్రం పోసేటప్పుడు వచ్చే మంట, దురద వంటివి రావు. ముఖ్యంగా మగవారు మొక్కజొన్న పీచుతో చేసిన టీ తాగడం వల్ల ప్రొస్టేట్ గ్రంధి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులు ఈ పీచుతో చేసిన టీ ని తరచూ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కర స్థాయిలు పెరగవు.