ఇలా చేస్తే వివాహం బంధం కష్టాల్లో పడినట్టే



పెళ్లంటే రెండు జీవితాలు. ఒక కుటుంబం నిర్మాణం. అలాంటి కుటుంబాలెన్నో కలిస్తేనే సమాజం. అందుకే సమాజ నిర్మాణానికి పెళ్లి చాలా ముఖ్యం.



ఏడుడుగులతో బంధంతో మొదలైన వారి ప్రేమ జీవితం కలకాలం ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.



ముఖ్యంగా భార్యాభర్తలు చేసే కొన్ని పనులు వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడాలి.

డబ్బు విషయంలో రహస్యాలు మెయింటేన్ చేయద్దు. ఒకరికి తెలియకుండా ఒకరు ఏమైనా కొనడాలు, పెట్టుబడులు పెట్టడాలు చేస్తే అవి పెద్ద గొడవలకు కారణం అవుతాయి.

ఏ విషయమైనా అరుస్తూ, కోపంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదురుగా కూర్చోబెట్టుకుని చెబితే మెల్లగా నచ్చజెబితే జీవిత భాగస్వామి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఆమెలోనో లేక అతనిలోనో తప్పులు వెతకడానికి మీరు వారి శత్రువు కాదు, జీవిత భాగస్వామి. కాబట్టి వారి పనుల్లో తప్పులెంచడం మాని కలిసి పనిచేసేందుకు ప్రయత్నించండి.

భార్యాభర్తల్లో ఒకరు మంచి ఉద్యోగ స్థాయిలో ఉండొచ్చు, రెండో వారిని ఆ విషయంపై చులకనగా మాట్లాడడం వంటివి చేయకూడదు.

మూడో వ్యక్తి జోక్యం సమస్యను పెంచుతుంది కానీ తగ్గించదు. అందుకే వేరే వారిని న్యాయమూర్తిగా పెట్టుకునే బదులు భార్యభర్తలిద్దరే మాట్లాడుకోవడం ఉత్తమం.

ఆఫీసులో మీరు ఎంత గొప్ప స్థానంలో అయినా ఉండొచ్చు, ఇంట్లో మాత్రం ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.