ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు ధర్మశాలలో జరుగుతోంది. ఇది రవిచంద్రన్ అశ్విన్‌కు 100వ టెస్టు కావడం విశేషం. ప్రపంచంలో 100 టెస్టులు ఆడిన 77వ ఆటగాడు అశ్విన్. భారత్ తరఫున 14వ ప్లేయర్. కపిల్ దేవ్ కాకుండా టెస్టుల్లో 3000 పరుగులు చేసి, 300 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు అశ్వినే. టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అశ్విన్ 11 సార్లు అందుకున్నారు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల మార్కును 35 సార్లు, మ్యాచ్‌లో 10 వికెట్లను ఎనిమిది సార్లు అందుకున్నారు. ప్రపంచంలో 250, 300, 350 టెస్టు వికెట్ల మార్కును వేగవంతంగా అందుకున్న బౌలర్ అశ్వినే. ప్రతి సంవత్సరం 50 వికెట్ల మార్కును నాలుగు సార్లు అందుకున్నారు. భారత బౌలర్లలో ఇది హయ్యస్ట్. ధర్మశాల టెస్టులో అశ్విన్ మరెన్ని రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.