రుక్మిణి చెక్కించిన శ్రీ కృష్ణుడి చిన్నప్పటి విగ్రహం ఎక్కడుందో తెలుసా!
ద్వారపయుగాంతంలో ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు విశ్వకర్మ చెక్కిన రెండు విగ్రహాలు కూడా నీటిలో కలసిపోయాయి. అవిప్పుడు ఉడిపిలో ఉన్నాయి
త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరంలో తపోదీక్షలో ఉండగా ఆ వైపు వస్తున్న నావ అలలకు పైపైకి లేచి ప్రమాదంలో చిక్కుకోబోయింది.
ఆ నావను ఒడ్డుకు చేర్చినందుకు కృతజ్ఞతగా నావలో ఏదైనా విలువైన వస్తువుని తీసుకోమని కోరారు. అందుకు చిరునవ్వు నవ్విన మధ్వాచార్యులు పడవలో ఉన్న గోపీచందనపు గడ్డలు ఇవ్వమని అడిగారు.
వాటిని చేతిలోకి తీసుకున్న మధ్వాచార్యులు చప్పున నీటిలో ముంచారు. ఆ మట్టి మొత్తం కరిగిన తర్వాత బయటపడ్డాయి శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలు.
శ్రీకృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలోనే సాగింది. ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఓ సారి దేవకీదేవి శ్రీకృష్ణునితో... నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగించినట్టే తనకూ కలిగేలా చేయాలని కోరింది.
అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడిలా మారిపోయి అన్న బలరాముడితో ఆడుకున్నాడు. అల్లరి కృష్ణుడి ఆటపాటలు చూసి దేవకితో పాటూ మురిసిపోయింది రుక్మిణి.
ఆ క్షణాన్ని పదిలంగా ఉంచాలని భావించిన రుక్మిణి వెంటనే విశ్వకర్మని పిలిచి ఆడుకుంటున్న బలరామకృష్ణులను చూపించి విగ్రహాలు తయారుచేయాలని కోరింది.
అలా తయారు చేయించిన విగ్రహాలు కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు నీటిలో కలసిపోయాయి.
ఆ తర్వాత ఇవే విగ్రహాలు మధ్వాచార్యుల చేతికి వచ్చాయి. ప్రస్తుతం ఉడిపిలో పూజలందుకుంటున్నది ఈ విగ్రహమే.