శ్రవణం భగవంతుడి గుణగణాలు, నామాలు, కథలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుని భగవంతుడికి దగ్గర కావడం. ఈ మార్గానికి పరీక్షిత్ మహారాజుఉదాహరణ.
కీర్తనం కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనస్సు సహజంగా భగవంతుడివైపు ఆకర్షితమవుతుంది. భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యుడిగా కీర్తి గాంచిన నారదుడు ఇందుకు ఉదాహరణ.
స్మరణం భగవంతుణ్ని ధ్యానించడమే స్మరణ భక్తి. నిరంతరం నారాయణ నామస్మరణతో తరించి ఎన్నో అడ్డంకులను అవలీలగా ఎదుర్కొన్న ప్రహ్లాదుడు ఇందుకు గొప్ప ఉదాహరణ.
పాదసేవనం భగవంతుడి పాదాల్ని, గురువుల పాదాల్ని సేవించడమే పాద సేవన భక్తి. అన్నయ్యే అన్నీ అనే ఉద్దేశంతో లక్ష్మణుడు రాముడికి పాదసేవనం చేసి తరలించాడు
అర్చనం తులసి, పుష్ప మాలలతో భగవంతుణ్ని పూజించడం అర్చన. దీనికి ఉదాహరణ మథురానగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జ. రకరకాల సువాసనలతో లేపనాలు తయారుచేయడం ఆమె పని.
వందనం భక్తి, శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించడం వందనభక్తి. దీనికి ఉదాహరణ అక్రూరుడు.
దాస్యం సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి సేవ చేస్తూ అదే భావనతో జీవించడమే దాస్యం. శ్రీ కృష్ణుడి చరణ సేవా భాగ్యాన్ని కోరుతూ ‘నీకు దాస్యంబు చేయని జన్మమేలా’ అని రుక్మిణి భక్తిని ప్రదర్శించింది.
సఖ్యం భగవంతుణ్ని స్నేహితుడిగా భావించి ఆయన గుణగణాల్ని అలవర్చుకోవడమే సఖ్య భక్తి. దీనికి అర్జునుడు మంచి ఉదాహరణ.
ఆత్మనివేదనం మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తననుతాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి. బలి చక్రవర్తి ఇందుకు ఉదాహరణ.