ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాదిలోగా దీపం పెట్టొచ్చా



కుటుంబ సభ్యులెవరైనా మరణిస్తే ఏడాది దాటేవరకూ ఇంట్లో దీపం వెలిగించరు, ఆలయాలకు వెళ్లరు. కొందరైతే దేవుడిని ఓ బట్టలో చుట్టేసి పైన పెట్టేస్తారు.



సంవత్సరికం అయిన తర్వాత మళ్లీ ఇల్లంతా శుద్ధి చేసి దేవుడికి దీపం వెలిగిస్తారు. అంటే ఏడాది పాటూ ఇంట్లో దేవుడు, దీపం, నైవేద్యం అన్నమాటే ఉండదు. కానీ ఇలా చేయడం సరైంది కాదంటోంది శాస్త్రం.



దీపం శుభానికి సంకేతం..భక్తితో దీపం వెలిగిస్తే అక్కడ దేవతలు తిరుగుతారని విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఇంట్లోనూ నిత్య దీపారాధన జరగాలంటారు.



ఎవరైనా మరణించినప్పుడు దీపం వెలిగించం కదా అంటారేమో... అప్పుడు కూడా 11 రోజుల పాటూ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు నుంచి నిత్యదీపారాధన కొనసాగించవచ్చు.



పండుగలు, ప్రత్యేకత పూజలు, శుభకార్యాలు చేయకూడదు కానీ దీపం పెట్టడమే మానెయ్యకూడదు.



దేవుడి మందిరంలో ఫొటోలన్నింటికీ బొట్టు పెట్టి, వాటి ముందు దీపం వెలిగించి, నైవేద్యం సమర్పిస్తుంటారు. అంటే ఆ ఫొటోల్లోకి దేవతలను ఆహ్వానిస్తారన్నమాట.



ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేద్యం లాంటి ఉపచారాలు చేయకుండా పక్కనపెట్టేస్తే అది పెద్ద దోషమే అంటారు. ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని దీపం ఆపుతుంది. అందుకే నిత్యదీపారాధన మానెయ్యరాదని చెబుతారు.



గుడికి వెళ్ళవచ్చు కానీ అర్చనలు, ప్రత్యేక పూజలు చేయకూడదు... గృహాప్రవేశాలు, కేశఖండన లాంటి శుభకార్యాలు చేయకూడదు... కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టకూడదు...ప్రత్యేకమైన అభిషేకాలు, వ్రతాలు చేయకూడదు.



ఇంట్లో పెద్దవారు పోతేనే ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. చిన్నవారు పోతే ద్వాదశ కర్మ తర్వాత అన్నీ యధావిధిగా ఆచరించవచ్చు.



ఇందులో సందేహాలేమైనా ఉంటే మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన పండితులను అడిగి నివృతి చేసుకోవచ్చు.



దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||
దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అలాంటి సంధ్యాదీపమా నీకు నమస్కారం అని అర్థం.