సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఎలూరులో ఓ పేద కుటుంబంలో 1960 డిసెంబరు 2న పుట్టింది.



1980లో వచ్చిన 'పండిచక్రమ్' తమిళ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో పాత్రపేరే ఆమె ఇంటిపేరు, ఒంటిపేరయింది.



కైపెక్కించే చూపులతో కుర్రకారుని తనవైపు తిప్పుకునే సిల్క్ పై నిర్మాతల కన్నుపడింది. ఆఫర్లిస్తామంటూ వెంటపడ్డారు. స్కిన్ షోకి వెనక్కుతగ్గకపోవడం, మాటలో విరుపు... సిల్క్ పై మరింత వెలుగుపడేలా చేసింది.



హీరోయిన్ల కన్నా ఆమెకు ఎక్కువ పారితోషికం. నిర్మాతలూ అంతే ఆనందంగా ఇచ్చేవారు. షూటింగ్ అంతా పూర్తయినా స్మిత పాటకోసం ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూసిన సందర్భాలెన్నో.



స్మిత ధాటికి తట్టుకోలేక కొందరు హీరోయిన్లు ఆమెలా అందాలప్రదర్శనకు సిద్ధమయ్యారంటే... శృంగార తారగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.



స్మిత గొప్ప అందగత్తె కాదు, చామనఛాయ. అయినా ఫొటోజెనిక్ ఫేస్ కావడం ఆమెకు కలిసొచ్చే పాయింట్. ముఖ్యంగా మత్తెక్కించే కళ్లు ఆమెకి ఎస్సెట్.



తెలుగుతోపాటూ తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 450 చిత్రాల్లో నటించి అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించింది.



ఎన్నో వైవిధ్య పాత్రల్లో నటించినా పరిశ్రమ మాత్రం సిల్క్ ని శృంగార తారగానే గుర్తించింది.



90ల్లో స్మిత హవా కాస్త నెమ్మదించింది. ఆమె స్టార్ డమ్ తగ్గింది. జీవితం అనే వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కుతున్నా అనుకుంది. కానీ పక్కనే ఉన్ను పాములను గుర్తించలేకపోయింది.



వెలుగులో పక్కనే ఉన్నవాళ్లు చీకట్లో మాత్రం ఆమెను ఒంటరిగా వదిలేశారు. ఒంటరి జీవితం వ్యసనాలవైపు నడిపించింది. నమ్మక ద్రోహం, అప్పుల భారం ఆమెను ఆత్మహత్య కు పురిగొల్పాయి.



ఇండియన్ మార్లిన్ మాన్రో గా గుర్తింపు తెచ్చుకున్న స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని సొంతింట్లో ఫ్యాన్ కి ఉరేసుకుంది.



ఆమె మరణంపై మరెన్నో వార్తలు వాదనలు బయటకు వచ్చాయి. అవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.