ఎక్కడైనా ఫైర్‌ బ్రాండే... హ్యాపీ బర్త్ డే రోజా

రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.

1991లో సినిమాల్లోకి వచ్చి రోజాగా పేరు మార్చుకున్నారు. మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ తో చేసిన ‘ప్రేమ తపస్సు’. ఈ సినిమా మొత్తం షూటింగ్ తిరుపతిలో జరిగింది.

ఎన్నో సినిమాలు చేశాక 1999లో తెలుగు దేశం పార్టీలో చేరారు. అదే ఆమె రాజకీయ అరంగేట్రం. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు రోజా. తరువాత వైసీపీలో చేరారు.

2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో గట్టిగా మాట్లాడే దమ్మున్న నాయకురాళ్లలో ఈమె కూడా ఒకరు.

2015 డిసెంబర్లో అసెంబ్లీ నుంచి ఏకంగా ఏడాది పాటూ సస్పెన్షన్ కు గురయ్యారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు.

తన గొంతును వినిపించడంలో ఎక్కడా రోజా భయపడలేదు. జగన్ తరుపున ప్రతినిధిగా చాలా సార్లు ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. అందుకే ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నారు.

సాయం చేయడంలోనూ రోజాది పెద్ద చెయ్యే. పేద పిల్లలను చదివించడం, తీవ్ర వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నగదును మంజూరయ్యేలా చూడడం వంటి పనులు ఎన్నో చేశారు.

దర్శకుడు సెల్వమణి రోజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక పాప, బాబు. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితంలో, బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా సాగిపోతోంది రోజా జీవితం.