ఎలాంటి నష్టభయం లేని పెట్టుబడులుపై చాలామంది మొగ్గు చూపుతుంటారు. తక్కువ పెట్టబడి పెట్టినా ఎక్కువ రాబడి వచ్చే పథకాల కోసం ఎదురు చూస్తుంటారు.



అలాంటి వారికి పోస్టాపీసులోని రికరింగ్‌ డిపాజిట్‌ పథకం ఎంతో ఉపయోగకరం. కేవలం రూ.100 ఆరంభించి మెచ్యూరిటీకి రూ.16 లక్షల వరకు పొందొచ్చు.

సురక్షితం

పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అత్యంత సురక్షితమైంది. అసలేమాత్రం నష్టం భయం ఉండదు. రూ.100తో ఈ ఖాతాను తెరవొచ్చు. ప్రతి నెలా డబ్బులు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.



కనీసం మొత్తం రూ.100. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. అంటే మీకు నచ్చినంత డబ్బును జమ చేసుకోవచ్చు.

వడ్డీరేటు ఫర్వాలేదు

కనీసం ఐదేళ్ల కాల పరిమితితో మీరు ఆర్‌డీ తెరవాల్సి ఉంటుంది. డిపాజిట్లపై ప్రతి మూడు నెలలకు వార్షిక ప్రాతిపదికన వడ్డీని జమ చేస్తారు. అంతేకాకుండా మొత్తం జమపై కంపౌడ్‌ ఇంట్రెస్ట్‌ వస్తుంది.



2020, జులై 1 నుంచి 5.8 శాతం వడ్డీరేటును అమలు చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సవరిస్తుంది.

రూ.10వేలు పెడితే..

ఈ ఆర్‌డీ పథకంలో మీరు పదేళ్ల వరకు నెలకు రూ.10వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ.16.28 లక్షలు అందుకోవచ్చు. అయితే మరో ముఖ్య విషయం తెలుసుకోవాలి. ఈ పథకంలో క్రమం తప్పకుండా ప్రతినెలా సమయానికి డబ్బులు జమ చేయాలి



గడువు తప్పితే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ప్రతినెలా ఒక శాతం జరిమానా చెల్లించాల్సి వస్తుంది. వరుసగా నాలుగు నెలలు కట్టకపోతే మీ ఖాతా ముగుస్తుంది. మళ్లీ యాక్టివేట్‌ చేసుకోవాలంటే రెండు నెలలు ఆగాలి.

నిబంధనలు ఇవీ..

పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ను సింగిల్‌ లేదా జాయింట్‌గా తెరవొచ్చు. జాయింట్‌ ఖాతాలో గరిష్ఠంగా ముగ్గురికే అవకాశం ఉంది. పదేళ్ల వయసు పిల్లలు గార్డియన్‌ సమక్షంలో ఖాతా తెరవొచ్చు.



ఈ పథకం మెచ్యూరిటీ సమయం ఐదేళ్లే అయినా మరో ఐదేళ్ల పాటు పొడగించుకోవచ్చు. ఈ ఖాతాకు నామినీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఖాతా తెరిచిన మూడేళ్ల తర్వాత ప్రీక్లోజర్‌ అవకాశం ఉంటుంది.